రాహుల్, పాండ్యాలపై  నిషేధం ఎత్తేయండి

Pandya-Rahul controversy: CK Khanna, Amitabh wait for SC order over call for SGM - Sakshi

సీఓఏను కోరిన బీసీసీఐ  తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా

న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాశారు. టీవీ షోలో మహిళలను కించపర్చే వ్యాఖ్యలు చేసినందుకు ఈ క్రికెటర్లిద్దరూ టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌నకు నాలుగు నెలలే ఉన్నందున వీరికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరమని, వర్ధమాన ఆటగాళ్లైనందున ఓ అవకాశం ఇద్దామని ఖన్నా కోరారు. ‘వారు ఇప్పటికే బేషరతుగా క్షమాపణ కోరారు. విచారణ కొనసాగిస్తూనే, రాహుల్, పాండ్యాలను తక్షణమే జాతీయ జట్టులోకి తీసుకుని న్యూజిలాండ్‌ పంపాలని సీఓఏ, బీసీసీఐ అధికారులను కోరుతున్నా.

ఆ ఇద్దరిది ముమ్మాటికీ తప్పే. అయినప్పటికీ చట్టాలను ఉల్లంఘించిన వారిగా చూడటం తప్పనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని లేఖలో ఖన్నా పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంలో విచారణ కోసం అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు ఖన్నా... బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే అభిప్రాయంతో బోర్డు కోశాధికారి అనిరుధ్‌ ఛౌదరి సైతం ఖన్నాకు లేఖ రాశారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ద్వారా ఈ మేరకు అధికారాలున్నాయి. కానీ, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లినందున తదుపరి ఏ చర్యలు తీసుకున్నా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top