సెమీస్‌లో పాలమూరు పాంథర్స్‌ | Palamuru Panthers book semis berth in Telangana Kabaddi League | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పాలమూరు పాంథర్స్‌

Sep 29 2018 10:15 AM | Updated on Mar 22 2019 2:59 PM

Palamuru Panthers book semis berth in  Telangana Kabaddi League - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌లో పాలమూరు పాంథర్స్, గద్వాల్‌ గ్లాడియేటర్స్, వరంగల్‌ వారియర్స్, కరీంనగర్‌ కింగ్స్‌ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. టోర్నీ లీగ్‌ దశలో 7 మ్యాచ్‌లాడిన వారియర్స్, పాంథర్స్‌ చెరో 5 విజయాలు సాధించి 27 పాయింట్లతో లీగ్‌లో వరుసగా టాప్‌–2 స్థానాల్లో నిలిచాయి. కరీంనగర్‌ కింగ్స్‌ 25 పాయింట్ల (4 విజయాలు, 1 డ్రా)తో, గ్లాడియేటర్స్‌ జట్టు 23 పాయింట్ల (4 విజయాలు)తో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి సెమీస్‌లో అడుగు పెట్టాయి. సరూర్‌నగర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు పాంథర్స్‌ జట్టు 30–17తో హైదరాబాద్‌ బుల్స్‌పై విజయం సాధించింది.

మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో 10–12తో వెనుకబడిన పాంథర్స్‌ జట్టు రెండో అర్ధభాగంలో విరుచుకుపడింది. రైడింగ్‌లో చెలరేగి ఏకంగా 20 పాయింట్లు స్కోర్‌ చేసింది. మరోవైపు ట్యాకిల్‌లోనూ సత్తా చాటిన పాం థర్స్‌ డిఫెండర్లు ప్రత్యర్థి జట్టుకు రెండో అర్ధభాగంలో కేవలం 5 పాయింట్లు మాత్రమే కోల్పోయారు. పాంథర్స్‌ తరఫున శ్రీకాంత్‌ ‘బెస్ట్‌ రైడర్‌’, రవీందర్‌ ‘బెస్ట్‌ డిఫెండర్‌’ అవార్డులను గెలుచుకున్నారు. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కరీంనగర్‌ కింగ్స్‌ 42–28తో మంచిర్యాల టైగర్స్‌పై సాధికార విజయాన్ని సాధించి 25 పాయింట్లతో సెమీస్‌లో చివరి బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement