అవన్నీ గాలి మాటలే: సర్ఫరాజ్‌

Pakistan skipper Sarfraz Ahmed denies talk of rift with Shoaib Malik - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఆండిల్‌ పెహ్లువాకియాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. సఫారీలతో రెండో వన్డే సందర్భంగా పెహ్లువాకియాపై అనుచిత వ్యాఖ్యలు చేసి సర్ఫరాజ్‌ నిషేధానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే పాక్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయమ్‌ మాలిక్‌కు ఆ జట్టు పగ్గాలను అప్పుచెబుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మాలిక్‌తో సర్ఫరాజ్‌కు సఖ్యత లేదనే వార్తలు హల్‌ చేశాయి. వీరి మధ్య ఎప్పట్నుంచో విభేదాలు నెలకొన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. ప్రధానంగా సర్ఫరాజ్‌ సారథ్యంలో మాలిక్‌ ఆడటానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆ వార్తల సారాంశం.

కాగా, దీన్ని తాజాగా సర్ఫరాజ్‌ ఖండించాడు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ గాలి మాటలుగా పేర్కొన్న సర్పరాజ్‌.. తమ జట్టంతా కలిసి కట్టుగానే ఉందంటూ స్పష్టం చేశాడు. ‘ ప‍్రస్తుతం మా జట్టులో ఎటువంటి విభేదాలు లేవు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. నా నాయకత్వంలో మాలిక్‌ ఆడటానికి అయిష్టంగా ఉన్నాడనే వార్తలు సత్యదూరం. మేమంతా ఒకరికి ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం’ అని సర్పరాజ్‌ తెలిపాడు. ఇక తమ జట్టు వరుస వైఫల్యాలపై స్పందించిన సర్పరాజ్‌.. త్వరలోనే గాడిలో పడతామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top