ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం జరిగే ఆటగాళ్ల వేలం ఈనెల 20న జరగనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
76 మంది క్రికెటర్లకు అవకాశం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం జరిగే ఆటగాళ్ల వేలం ఈనెల 20న జరగనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ వేలం నేడు (శనివారం) జరగాల్సి ఉండగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలతో తేదీని మార్చాల్సి వచ్చింది. ఇక ఈ వేలంలో పాల్గొనేందుకు 750 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారని బోర్డు తెలిపింది. అయితే ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో 27 మంది ఆటగాళ్లకు చోటిచ్చేందుకు అనుమతి ఉంది. ఇందులో తొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లుంటారు. దీంతో ఆయా జట్లు తమ కోటాను పూర్తి చేసుకోవాలంటే వేలంలో 76 మందిని కొనుగోలు చేసేందుకు వీలుంది.
కోల్‌కతా జట్టులో ఇప్పుడు 14 మంది ఆటగాళ్లే ఉండడంతో వారు అత్యధికంగా 13 మందిని తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సీజన్‌కు గరిష్టంగా అన్ని జట్లు కలిపి రూ.143.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అందరికంటే ఎక్కువగా రూ.23.35 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉండగా... ముంబై మాత్రం రూ.11.55 కోట్లు మాత్రమే ఖర్చు చేసే వీలుంది. ఆటగాళ్ల వేలం అనంతరం 21న ఫ్రాంచైజీల వర్క్ షాప్ ఉంటుంది.