ఒలింపిక్ ఆఫ్ ద ఫీల్డ్ | Olympic of the field | Sakshi
Sakshi News home page

ఒలింపిక్ ఆఫ్ ద ఫీల్డ్

Aug 10 2016 1:28 AM | Updated on Sep 4 2017 8:34 AM

ఒలింపిక్ ఆఫ్ ద ఫీల్డ్

ఒలింపిక్ ఆఫ్ ద ఫీల్డ్

మైదానంలో చిరుత వేగంతో పరిగెత్తడమే కాదు.. తన డ్యాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని జమైకా సూపర్ స్టార్ ఉసేన్ బోల్ట్ ...

బోల్ట్... సాంబా డ్యాన్స్
రియో డి జనీరో: మైదానంలో చిరుత వేగంతో పరిగెత్తడమే కాదు.. తన డ్యాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని జమైకా సూపర్ స్టార్ ఉసేన్ బోల్ట్ నిరూపించుకున్నాడు. ఒలింపిక్స్‌లో అత్యంత ఆదరణ కలిగిన అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న ఈ 29 ఏళ్ల పరుగు వీరుడు ఇక్కడ తొలిసారిగామీడియా ముందుకు వచ్చాడు. సమావేశం ముగిశాక ఫొటోలకు ఫోజులిస్తుండగా ఒక్కసారిగా వెనకవైపు నుంచి డ్రమ్మర్స్‌తో పాటు 10 మంది సాంబా నృత్యకారులు వచ్చారు. వచ్చీ రావడంతోనే బోల్ట్‌ను చుట్టుముట్టి తమ డ్యాన్స్‌ను ప్రారంభించారు. ఏమాత్రం బెదరని బోల్ట్ కూడా వారితో పాటే కాళ్లు కదిపాడు. అనంతరం వారితో వరుసగా నిలబడి సాంబా తరహాలో నృత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఇవే తన చివరి ఒలింపిక్స్ అని బోల్ట్ మరోసారి స్పష్టం చేశాడు.

 

మరో వింత ‘జంట’
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ సాక్షిగా మరో ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. బ్రెజిల్‌కు చెందిన 25 ఏళ్ల ఇసడోరో రగ్బీ సెవెన్ క్రీడాకారిణి. అదే దేశానికి చెందిన మరో 28 ఏళ్ల మహిళ మరోర్జీ ఒలింపిక్స్‌లో వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఒలింపిక్స్‌ను చిరకాలం గుర్తిండిపోయేలా మార్చుకోవాలని ఈ ఇద్దరూ భావించారు. రగ్బీ సెవెన్ ఫైనల్ ముగిసి మెడల్స్ ప్రదానం అయ్యాక మర్జోరీ వెళ్లి ఇసడోరాకు పెళ్లి ప్రతిపాదన చేసింది. అంతే ఓ గాఢ చుంబనంతో ఇసడోరా తన అంగీకారం తెలిపింది. ‘జట్టులో తను చోటు దక్కించుకున్న అనంతరం ఈ గేమ్స్ తనకు ప్రత్యేకంగా ఉండాలని భావించాను. ఇక ఆమే నా జీవితం. ప్రేమే గెలుస్తుందని అందరికీ నిరూపించదలిచాను’ అని ఎన్యా పేర్కొంది. బ్రెజిల్‌లో గే, లెస్బియన్ వివాహాలు చట్టరీత్యా అంగీకారమే. ఈ ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారట.

 

‘జికా’ తలనొప్పి..!
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు రావడానికి ముందు దిగిన ఓ ఫొటో.. ఆ అ మెరికా మహిళా ఫుట్‌బాలర్‌ను ఎక్కడికి వెళ్లినా ‘వెంటాడింది’. బ్రెజిల్‌లో జికా వైరస్ తీవ్రతను గుర్తు చేస్తూ గోల్‌కీపర్ హోప్ సోలో తన ముఖానికి మాస్క్‌తో పాటు చేతిలో కీటక నిరోధక బ్యాట్‌ను పట్టుకుని ఫొటో దిగింది. అంతేకాకుండా ‘దీన్ని షేర్ చేయకండి.. ఇలా మీరూ సిద్ధం కండి!’ అనే కామెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది బ్రెజిల్ వాసుల మనస్సు చివుక్కుమనేలా చేసింది. తమ కోపాన్ని తీర్చుకునేందుకు వారు అమెరికా, ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అవకాశంగా తీసుకున్నారు. బంతి కీపర్ హోప్ దగ్గరకు వెళ్లినప్పుడల్లా స్టేడియంలోని ప్రేక్షకులు మొత్తం కసిదీరా ‘జికా.. జికా’ అంటూ అరవడం ప్రారంభించారు. నిజానికి కివీస్‌తో మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇలాగే హేళన చేసినప్పటికీ ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో ఇది తారాస్థాయికి చేరింది. అయితే ఎంతగా రెచ్చగొట్టినా హోప్ మాత్రం ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
Advertisement