భారత స్టార్ కాంపౌండ్ ఆర్చర్ అభిషేక్ వర్మ మనోగతం
న్యూఢిల్లీ: వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయినప్పటికీ... తిరిగి జాతీయ జట్టులోకి వస్తానని భారత స్టార్ కాంపౌండ్ ఆర్చర్ అభిషేక్ వర్మ ధీమా వ్యక్తం చేశాడు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం.... తదుపరి భారత్ వేదికగా జరిగే 2030 కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడమే తన తదుపరి లక్ష్యాలు అని ఢిల్లీకి చెందిన అభిషేక్ స్పష్టం చేశాడు.
ఇటీవల జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో చికిత–సాహిల్ ద్వయం కాంపౌండ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు బెర్త్ లభించింది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్ తరఫున పాల్గొనే జోడీని సెలెక్షన్ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసియా క్రీడల కోసం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో అభిషేక్ విఫలమై భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
తాను ఆసియా క్రీడలకు దూరమైనా తాను మార్గనిర్దేశం చేసిన యువ క్రీడాకారులు పతకాలు సాధించడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని అభిషేక్ వివరించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో పృథ్వీరాజ్ యోధాస్ తరఫున అభిషేక్ పోటీపడుతున్నాడు. ‘ఆసియా క్రీడల్లో నా విద్యార్థులు, జూనియర్లు పోటీపడ్డారు. నేను ఎలా ప్రదర్శించాలని కోరుకున్నానో వారు అలాగే రాణించారు. కాంపౌండ్ ఆర్చరీలో భారత్ ఒక బలమైన శక్తిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది’ అని అభిషేక్ తెలిపాడు.
‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు భారత్‌కు బెర్త్ ఖరారైంది. దాంతో మనోళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఒత్తిడి లేకుండా ఒలింపిక్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. విశ్వ క్రీడలకు సిద్ధమయ్యేందుకు మనకు ఏడాదిన్నర సమయం ఉంది, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని 37 ఏళ్ల అభిషేక్ పేర్కొన్నాడు. మూడు ఆసియా క్రీడల్లో పాల్గొని రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు గెలుచుకున్న అభిషేక్... ప్రపంచకప్ టోర్నీల్లో 10 స్వర్ణాలు, 2 రజతాలు, 11 కాంస్య పతకాలు గెలిచాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో రజతం సొంతం చేసుకున్నాడు.
‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంపౌండ్ విభాగంలో ఒక పతకం గెలవగలదని నమ్ముతున్నాను. రికర్వ్ విభాగంలోనూ భారత జట్టు రాణిస్తోంది. ఓవరాల్‌గా ఆర్చరీలో భారత్ రెండు లేదా మూడు పతకాలు గెలవగలదని భావిస్తున్నాను’ అని గతంలో ప్రపంచ మూడో ర్యాంకర్‌గా ఉన్న అభిషేక్ తెలిపాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, అభిషేక్ భారత ఆర్చర్ల పురోగతిలో తన పాత్రను కొనసాగిస్తున్నాడు. తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికితతో సహా పలువురు యువ ఆర్చర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోనిపట్ కేంద్రానికి మారిన తర్వాత చికిత అతని మార్గదర్శకత్వంలో అద్భుతంగా రాణించింది.
‘ఇతరులకు మార్గనిర్దేశం చేయడానికి అధికారికంగా కోచ్‌గా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. సీనియర్‌గా భారత ఆర్చరీని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడాల్సిన బాధ్యత నాపై ఉంది. మొదటి నుంచీ యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేస్తున్నాను’ అని అభిషేక్ చెప్పాడు. ‘నేను నోట్స్ రాసుకునేవాడిని, మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించేవాడిని, నా ఆటను మెరుగుపరచుకోవడానికి కృషి చేసేవాడిని. ఆ అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలను నా జూనియర్లకు అందించేవాడిని, తద్వారా వారు నా అనుభవం నుంచి ప్రయోజనం పొందగలిగేవారు.
అది అధికారిక బాధ్యత కాకపోయినా, వారికి మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఆర్చర్లకు మంచి వినోదాత్మక కార్యకలాపం. సాధారణ శిక్షణ, టోర్నమెంట్లలోని తీవ్రత నుంచి కొంత దూరంగా ఉండటానికి, విశ్రాంతి తీసుకోవడానికి, జట్టు ఐక్యతను పెంపొందించుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇది భిన్నమైన అనుభవం, అదే దాని ప్రత్యేక విలువ’ అని అభిషేక్ వివరించాడు.


