అమెరికాలో రామాయణ ప్రీమియర్‌  | Ramayana Part 1 host world premiere on 27 October 2026 | Sakshi
Sakshi News home page

అమెరికాలో రామాయణ ప్రీమియర్‌ 

Oct 19 2026 3:48 AM | Updated on Oct 19 2026 3:48 AM

Ramayana Part 1 host world premiere on 27 October 2026

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్న అకాడమీ మ్యూజియం ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌లో గల డేవిడ్‌ గెఫెన్‌ థియేటర్స్‌లో ‘రామాయణ: పార్ట్‌ 1’ ప్రీమియర్‌ ప్రదర్శితం కానుంది. 2026 అక్టోబరు 27న ప్రదర్శితం కానున్న ఈ ప్రీమియర్‌కు ఆహ్వానం అందుకున్న హాలీవుడ్, భారతీయ సినీ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ ప్రీమియర్‌లో ‘రామాయణ’ తొలి భాగం త్రీడీ వెర్షన్‌ను ప్రదర్శిస్తారు. 

‘‘భారతీయ ఇతిహాసం రామాయణను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఇది ముందడుగు అవుతుంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌ వేడుకలకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. మొత్తం 945 సీటింగ్‌ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌లో స్క్రీనింగ్‌ జరగనుంది. రెడ్‌ కార్పెట్‌ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు సంప్రదాయ భారతీయ పండగ దుస్తులు ధరించి రావాలని కోరాము’’ అని ‘రామాయణ’ యూనిట్‌ పేర్కొంది. 

ఇక నితీష్‌ తివారి దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబరు 5న, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటించారు. ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హాన్స్‌ జిమ్మర్, ఏ.ఆర్‌. రెహమాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement