మళ్లీ జొకో‘విన్‌’ 

Novak Djokovic Wins Australian Open Grand Slam Mens Singles Champion - Sakshi

ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌

ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌పై అద్భుత విజయం

మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ కైవసం

రూ. 19 కోట్ల 71 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

తనకెంతో అచ్చొచ్చిన వేదికపై మరో అద్భుత ప్రదర్శనతో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అదరగొట్టాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ టోర్నీ ఫైనల్స్‌లో 8–0తో తన అజేయ రికార్డును కొనసాగించాడు. ఈ గెలుపుతో జొకోవిచ్‌ నేడు విడుదల చేసే అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో రాఫెల్‌ నాదల్‌ను రెండో స్థానానికి నెట్టి మళ్లీ తాను ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు.

మెల్‌బోర్న్‌: పోరాట పటిమకు పెట్టింది పేరైన సెర్బియా టెన్నిస్‌ యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ ఆదివారం వీరోచిత ఆటతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగం టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. రాడ్‌లేవర్‌ ఎరీనాలో ఆదివారం 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6–4, 4–6, 2–6, 6–3, 6–4తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌కాగా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఎనిమిదోది.

గతంలో జొకోవిచ్‌ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019లలో చాంపియన్‌గా నిలిచాడు. తాజా విజయంతో జొకోవిచ్‌ సోమవారం విడుదల చేసే ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నాదల్‌ నుంచి మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్‌ థీమ్‌కు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ను ఓడించిన 26 ఏళ్ల  డొమినిక్‌ థీమ్‌ ఫైనల్లోనూ మరో సంచలనం నమోదు చేస్తాడనిపించింది. కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ ఆడుతున్న థీమ్‌ తొలి సెట్‌ను కోల్పోయాక... అనూహ్యంగా పుంజుకొని రెండు, మూడు సెట్‌లలో నెగ్గి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా అడుగులు వేశాడు. అయితే గతంలో ఆడిన ఏడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో విజయం సాధించి అజేయంగా ఉన్న 32 ఏళ్ల జొకోవిచ్‌ తన ప్రత్యర్థికి సులువుగా తలవంచాలనుకోలేదు.

తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్‌ నాలుగో సెట్‌లో ఎనిమిదో గేమ్‌లో థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. జొకోవిచ్‌ ఆటతీరు గాడిలో పడటంతో ఐదో సెట్‌లో థీమ్‌ ఒత్తిడికి లోనై తడబడ్డాడు. మూడో గేమ్‌లో థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చాంపియన్‌గా నిలిచాడు.

ప్రపంచంలోని నా అభిమాన కోర్టు, నా అభిమాన స్టేడియమిదే. ఈ ట్రోఫీని మరోసారి అందుకోవడంతో పరమానందం కలుగుతోంది. ఈ ఏడాది విషాదభరిత సంఘటనలతో ప్రారంభమైంది.  ఆస్ట్రేలియాలో కార్చిచ్చు, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సంఘర్షణ వాతావరణం, పలువురు ప్రాణాలు కోల్పోవడం... నా ఆప్తమిత్రుడు, బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబీ బ్రయాంట్‌ దుర్మరణం కలిచి వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం సంఘటితంగా ఉండాలి. క్రీడాకారులకూ వేరే జీవితం ఉంటుంది. మనల్ని అభిమానించే వాళ్లతో, ప్రేమించే వాళ్లతో, కుటుంబసభ్యులతో బాధ్యతగా మెలగాలి. ఫైనల్లో థీమ్‌ బాగా ఆడాడు. భవిష్యత్‌లో అతను కచ్చితంగా గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరిస్తాడు. –జొకోవిచ్‌

►3 ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని 8 అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన మూడో ప్లేయర్‌ జొకోవిచ్‌. ఫెడరర్‌ వింబుల్డన్‌ టోర్నీలో 8 సార్లు, నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 12 సార్లు చాంపియన్‌గా నిలిచారు.
►పురుషుల సింగిల్స్‌ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్‌ (17) మూడో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌–20), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌–19) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top