రాబోయే న్యూజిలాండ్ పర్యటన తమ యువ జట్టుకు చాలా మేలు చేస్తుందని భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడానికి ఇది దోహదం చేస్తుందన్నాడు.
కివీస్ పర్యటనపై ధోని వ్యాఖ్య
ముంబై: రాబోయే న్యూజిలాండ్ పర్యటన తమ యువ జట్టుకు చాలా మేలు చేస్తుందని భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడానికి ఇది దోహదం చేస్తుందన్నాడు. ‘అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే... వచ్చే వరల్డ్‌కప్ జరిగే ఆసీస్, కివీస్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లకు అక్కడి వికెట్ల గురించి తెలుస్తుంది. నేను తొలిసారి కివీస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫీల్డింగ్ పోజిషన్లు చాలా గందరగోళంగా ఉండేవి. మైదానం ఆకారాలు అసాధారణంగా ఉండటమే ఇందుకు కారణం.
ఫైన్ లెగ్‌ను చాలా దూరంగా ఉంచాల్సి వచ్చేది. వికెట్ కీపింగ్ కోణం కూడా స్క్వేర్ లెగ్ మాదిరిగా కనిపించేది. కాబట్టి కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది’ అని జట్టు బయలుదేరడానికి ముందు ధోని వ్యాఖ్యానించాడు. మొత్తానికి కివీస్ పర్యటన చాలా ఉత్సాహంగా ఉంటుందన్నాడు. ఐసీసీ కొత్త నిబంధనల వల్ల కొన్ని మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్లు నమోదయ్యే అవకాశముందన్నాడు. అయితే ఇదంతా ఆడే వికెట్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఇక జట్టు విషయానికొస్తే... స్వదేశంలో రాణించిన చాలా మంది యువ ఆటగాళ్లు ఈ టూర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన చాలా సానుకూలాంశాలను నేర్పించిందన్నాడు. సిరీస్ ఓడినా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.
‘టెయిల్’ నిలబడాలి
టెయిలెండర్ల సహాయం జట్టుకు చాలా అవసరమని ధోని గుర్తు చేశాడు. పరుగుల పరంగానే కాకుండా సాధ్యమైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలన్నాడు. లేకపోతే ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే బ్యాట్స్‌మన్ వృథా అయిపోతాడని సూచించాడు. టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లను రంజీల్లో ఆడించాలని ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ స్పందించాడు. విదేశీ పర్యటనలకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం సరైందేనన్నాడు. బౌలర్లలో ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదేనని, అయితే డ్రై పిచ్‌లపై బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాలని సూచించాడు.