'జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా'

New Training Video Of Mike Tyson Return To Boxing Became Viral  - Sakshi

న్యూయార్క్‌ : బాక్సింగ్‌ ప్రపంచంలో మైక్‌ టైసన్‌ పేరు తెలియని వారు ఉండరు. అతని బరిలోకి దిగాడంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్‌ పంచ్‌లకు తలొగ్గాల్సిందే. రెండు దశాబ్ధాల పాటు తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మాజీ ప్ర‌పంచ హెవీవెయిట్ బాక్సింగ్‌ చాంపియ‌న్ మైక్ టైస‌న్ మ‌ళ్లీ త‌న పంచ్ ప‌వ‌ర్ చూపించ‌నున్నాడు. బౌట్ స‌త్తా చాటేందుకు మైక్ టైస‌న్ ప్రిపేర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా అత‌ను ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేశాడు. చాలా క‌ఠోరంగా క‌స‌ర‌త్తు చేస్తున్న 53 ఏళ్ల మైక్‌ టైసన్‌ను చూస్తుంటే అతని పవర్‌ ఏ మాత్రం తగ్గలేదిని తెలుస్తుంది. ఆ వీడియోలో ' నేను మళ్లీ రింగ్‌లోకి వస్తున్నా.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఇదే స‌వాల్ ' అంటూ కామెంట్‌ జత చేశాడు.  53 ఏళ్ల మైక్ టైసన్ వర్కవుట్ చేస్తూ చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.('ఆ విషయంలో సచిన్‌ కంటే కోహ్లి ముందుంటాడు')

వేగం, పంచ్ పవరుతో హెవీ వెయిట్‌గా నిలిచి పలు టైటిళ్లు సాధించిన టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసమే మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతున్నారని సమాచారం. ఇక చివరిసారిగా 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్‌తో టైసన్ చివ‌రి బౌట్‌లో త‌ల‌ప‌డ్డాడు. 1986లో 20 ఏళ్ల వ‌య‌సులోనే టైసన్ ట్రెవ‌ర్ బెర్‌బిక్‌ను ఓడించి ప్ర‌పంచ యువ హెవీవెయిట్  బాక్సింగ్‌ చాంపియ‌న్‌గా ఖ్యాతి గాంచాడు. టైస‌న్ త‌న కెరీర్‌లో మొత్తం 50 ప్రొఫెష‌న‌ల్ ఫైట్స్‌ను గెలిచాడు. ఇక మాజీ చాంపియ‌న్ ఇవాండ‌ర్ హోలీఫీల్డ్‌తో టైస‌న్ త‌న ఎగ్జిబిష‌న్ బౌట్‌లో త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top