ముంబై గెలిచిందోచ్‌...

Mumbai Indians won by 8 wickets - Sakshi

 చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 8 వికెట్లతో విజయం   

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అజేయ అర్ధ సెంచరీ  

హమ్మయ్య... ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ మరో విజయం సాధించింది. రెండు రోజుల క్రితం వరకు పట్టికలో చివరి స్థానంలో నిలిచేందుకు తమతో పోటీ పడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అద్భుత ఆటను చూసి స్ఫూర్తి పొందిందో ఏమో పటిష్ట చెన్నైపై కీలక గెలుపుతో ఐపీఎల్‌లో తమ ఆట ముగిసిపోలేదని ముంబై గుర్తు చేసింది. పనిలో పనిగా లీగ్‌ తొలి మ్యాచ్‌లో తమకు అనూహ్యంగా షాక్‌ ఇచ్చిన సూపర్‌ కింగ్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముంబైకి ఇది రెండో విజయం కాగా... మెరుపు బ్యాటింగ్‌తో ఇంతకుముందు మ్యాచ్‌ గెలిపించిన రోహిత్‌ శర్మనే ఈసారి అర్ధ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైనా, అంబటి రాయుడు రాణించినా బౌలింగ్‌ వైఫల్యంతో చెన్నైకి రెండో ఓటమి తప్పలేదు.   

పుణే: పేరుకే చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంత మైదానం... కానీ మహారాష్ట్ర మద్దతంతా ముంబై టీమ్‌కే... ఇలాంటి వాతావరణంలో రోహిత్‌ బృందం మురిసింది. వాంఖెడేలో కూడా ఓడుతూ వచ్చిన ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు తమకు అండగా నిలిచిన అభిమానుల మధ్య కీలక విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రైనా (47 బంతుల్లో 75 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రాయుడు (35 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్స్‌ 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (33 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా... లూయీస్‌ (43 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  

రైనా అర్ధసెంచరీ... 
అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్స్‌ మూడో బంతికి కొట్టిన భారీ సిక్సర్‌తో అతని జోరు మొదలైంది. అనంతరం కృనాల్‌ బౌలింగ్‌లోనూ మరో సిక్స్‌ కొట్టిన రాయుడు హార్దిక్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరోవైపు వాట్సన్‌ (12) విఫలం కావడంతో బరిలోకి దిగిన రైనా కూడా సిక్సర్‌తోనే ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మార్కండే బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టాడు. ఒకరితో మరొకరు పోటీ పడి దూకుడుగా ఆడిన వీరిద్దరు రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కృనాల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడు అవుట్‌ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ధోని, ఆ తర్వాత ధాటిని పెంచాడు. ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడం విశేషం. మరోవైపు 35 బంతుల్లో రైనా అర్ధసెంచరీ పూర్తయింది. అయితే మరో భారీ స్కోరుకు సిద్ధమమవుతున్న తరుణంలో మెక్లీనగన్‌ వేసిన 18వ ఓవర్‌ చెన్నైకి బ్రేక్‌ వేసింది. ఈ ఓవర్లో ధోని, బ్రేవో (0)లను అవుట్‌ చేసిన అతను నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బిల్లింగ్స్‌ (3) విఫలమైనా... చివరి రెండు ఓవర్లలో రైనా ఒక్కో సిక్సర్‌ బాదడంతో సూపర్‌ కింగ్స్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. చివర్లో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. తొలి పది ఓవర్లలో 91 పరుగులు చేసిన చెన్నై, తర్వాతి పది ఓవర్లలో మరో 78 పరుగులు మాత్రమే జోడించగలిగింది.  

కీలక భాగస్వామ్యాలు... 
ఛేదనలో ముంబైకి ఓపెనర్లు సూర్యకుమార్, లూయీస్‌ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. విధ్వంసకరమైన బ్యాటింగ్‌ ప్రదర్శించకుండానే ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో వీరిద్దరు చకచకా పరుగులు జోడించారు. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 69 పరుగులు జోడించిన తర్వాత జడేజా అద్భుత క్యాచ్‌కు సూర్యకుమార్‌ వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన రోహిత్‌... వాట్సన్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. లూయీస్, రోహిత్‌ భాగస్వామ్యం ముంబై విజయంపై ఆశలు పెంచింది. వీరిద్దరు 38 బంతుల్లోనే 59 పరుగులు జత చేశారు. లూయీస్‌ను బ్రేవో అవుట్‌ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే హార్దిక్‌ పాండ్యా (8 బంతుల్లో 13 నాటౌట్‌; 1 సిక్స్‌) అండగా రోహిత్‌ మ్యాచ్‌ను ముగించాడు. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశలో ఠాకూర్‌ వేసిన 19వ ఓవర్లో రోహిత్‌ నాలుగు ఫోర్లతో జట్టును గెలుపు ముంగిట నిలిపాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top