ధోని రివ్యూ సిస్టమ్..! | MS Dhoni Shows Again Why He is the King of DRS | Sakshi
Sakshi News home page

ధోని రివ్యూ సిస్టమ్..!

Sep 1 2017 2:37 PM | Updated on Sep 17 2017 6:15 PM

ధోని రివ్యూ సిస్టమ్..!

ధోని రివ్యూ సిస్టమ్..!

శ్రీలంక పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోనిని పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఎంపిక చేసిన అనంతరం అతనే పేరే ఎక్కువగా వినబడుతోంది.

కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోనిని పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఎంపిక చేసిన అనంతరం అతనే పేరే ఎక్కువగా వినబడుతోంది. అటు లంక పర్యటనలో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తొలుత విమర్శకుల నోళ్లకు తాళం వేసిన ధోని అదే క్రమంలో తరచు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. సాధారణంగా ధోని అంటే బ్యాటింగ్, కీపింగ్ గురించే మనకు తెలుసు. బ్యాటింగ్ లో హెలికాప్టర్ షాట్లకు మారుపేరైన ధోని.. కీపింగ్ లో అద్భుతమైన క్యాచ్ లతో పాటు స్టంపింగ్ లకు అతనికి అతనే సాటి.

ఇదిలా ఉంచితే, డీఆర్ఎస్(డెసిషన్ రివ్య్యూ సిస్టమ్) గురించి అందరికీ తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని పునః సమీక్షించే పద్దతినే డీఆర్ఎస్ అంటారు. కాగా, డీఆర్ఎస్ అంటే ధోని రివ్య్యూ సిస్టమ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానం పోటెత్తింది. శ్రీలంకతో జరిగిన నాల్గో వన్డేనే ఇందుకు ఉదాహరణ. డీఆర్ఎస్ ను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన ధోని..మరొకసారి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసి సక్సెస్ కావడంతో అతని పేరు మార్మోగుతోంది. నాల్గో వన్డేల్లో లంక కీలక ఆటగాడు డిక్ వెల్లా డీఆర్ఎస్ ద్వారా పెవిలియన్ కు పంపిన ధోని.. కింగ్ ఆఫ్ డీఆర్ఎస్ గా మన్ననలు అందుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళితే.. లంకేయులతో నాల్గో వన్డేలో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 375 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన లంక జట్టు 22 పరుగుల వద్ద తొలి వికెట్ గా డిక్ వెల్లా వికెట్ ను నష్టపోయింది. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో డిక్ వెల్లా ధోనికి క్యాచ్ ఇచ్చాడు. అయితే దీనిపై ధోని అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ మాత్రం నాటౌట్ అని తేల్చిచెప్పాడు. కాగా, ధోని మాత్రం తన అప్పీల్ పై పూర్తి నమ్మకం ఉంచాడు. ఆ క్రమంలోనే కెప్టెన్ కోహ్లికి డీఆర్ఎస్ కు వెళదామని ధోని సూచించాడు. అంతే కోహ్లి డీఆర్ఎస్ కు వెళ్లడం డిక్ వెల్లా పెవిలియన్ కు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. దాంతో ధోనిపై అభిమానం వర్షం కురుస్తోంది.

ఎంతో నిశిత దృష్టి ఉంటే కానీ అటువంటి అవుట్ల విషయాల్లో సవాల్ చేయలేం. కానీ ధోని చేశాడు.. సక్సెస్ అయ్యాడు. అందుచేత ధోనిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అభిమానులు. డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కొనియాడుతున్నారు. అంతటి సూక్ష్మ బుద్ధి ధోనికి దేవుడిచ్చిన వరంగా ఒకరు పేర్కొనగా, డీఆర్ఎస్ ను ధోని రివ్యూ సిస్టమ్ గా మార్చి అతన్ని గౌరవించాలని మరొక అభిమాని అభిప్రాయపడ్డాడు. 300 వన్డే మ్యాచ్ ఆడిన ధోని అజేయంగా 49 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement