మహ్మద్‌ సిరాజ్‌కు మళ్లీ నిరాశే

Mohammed Siraj Did Not Get Chance For Second Test Against WI - Sakshi

రెండో టెస్ట్‌ తుది జట్టు ప్రకటన

విహారికి సైతం దక్కని చోటు

సాక్షి, హైదరాబాద్‌ : వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న ఈ హైదరాబాద్‌ బౌలర్‌కు మరోసారి జట్టు మేనేజ్‌మెంట్‌ మొండి చెయ్యి చూపించింది. సిరాజ్‌తో పాటు మరో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారికి సైతం రెండో టెస్ట్‌ తుది జట్టులో చోటు దక్కలేదు.

మ్యాచ్‌కు ముందు ఒకరోజే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ ఓ కొత్త సంప్రదాయానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్‌, విహారిల పేర్లు లేవు. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్ట్‌కు సైతం బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో ఈ తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం లభిస్తోందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ అందరి అంచనాలను పటాపంచల్‌ చేస్తూ వీరికి అవకాశం కల్పించకుండా జట్టును ప్రకటించింది.

ఇక మయాంక్‌ అగర్వాల్‌కు కూడా నిరాశే ఎదురైంది. తొలి టెస్ట్‌లో కేఎల్‌ రాహుల్‌ విఫలమైనా జట్టు మేనేజ్‌మెంట్‌ అతనికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనే రాహుల్‌కు మరో అవకాశం ఇచ్చి ఉంటారని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశవాళీ, భారత్‌-ఏ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌కు అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడటానికి మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు.

ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేసిన విహారికి విండీస్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశం దక్కకపోవడం గమనార్హం. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ప్రకటించిన జట్టులో ముగ్గుర్లు స్పిన్నర్లు అవసరమైతే.. శార్థుల్‌ ఠాకుర్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఒకవేళ ఇద్దరి స్పిన్నర్లతో బరిలో దిగితే మాత్రం కుల్‌దీప్‌పై వేటు పడే అవకాశం ఉంది.

బీసీసీఐ ప్రకటించిన తుది జట్టు
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, పుజారా, అజింక్యా రహానే, రిషబ్‌ పంత్‌, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, శార్దుల్‌ ఠాకుర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top