
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తన మనసు మార్చుకుంది. ప్రస్తుతమున్న ఫామ్‌లో ఉండి, ఫిట్‌నెస్ సహకరిస్తే 2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కూడా ఆడతానని స్వయంగా మిథాలీరాజ్ చెప్పింది. జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఇదే నా చివరి వరల్డ్ కప్ అని పేర్కొన్న మిథాలీ... తాజాగా ఫిట్‌గా ఉంటే తన కెరీర్‌లో ఆరో వరల్డ్ కప్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. రానున్న మూడేళ్ల కాలం తన భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పింది. ప్రస్తుతానికి తన దృష్టంతా 2018లో జరిగే ఇతర టోర్నీలతో పాటు, టి20 ప్రపంచకప్‌పైనే ఉందని తెలిపింది. వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి వచ్చే జనవరి వరకు భారత షెడ్యూల్ ఖాళీగా ఉంది.
దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు
భారత మహిళల జట్టు 2018 ఫిబ్రవరిలో దక్షిణా ప్రికాలో పర్యటించనుంది. వన్డే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ తమ తొలి రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వెల్లడించింది. ఫిబ్రవరి 5నుంచి 10వరకు ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది.