బొటాస్‌దే బోణీ

Mercedes Driver Valtteri Bottas Won The First Race Of The 2020 Season - Sakshi

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానం

స్పీల్‌బర్గ్‌: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2020 సీజన్‌ తొలి రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్‌ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్‌ పొజిషన్‌’తో బరిలోకి దిగిన బొటాస్‌ చివరి ల్యాప్‌ వరకు ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్‌ అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 55.739 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ రేసులో తొమ్మిది మంది మధ్యలోనే వైదొలిగారు. డ్రైవర్ల అత్యుత్సాహంతో మూడుసార్లు ఈ రేసులో సేఫ్టీకారు రావాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో మెర్సిడెస్‌కే చెందిన మరో స్టార్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌పై మూడు స్థానాల గ్రిడ్‌ పెనాల్టీ విధించారు.
అనంతరం ప్రధాన రేసులో ట్రాక్‌పై మరో డ్రైవర్‌ను ఢీకొట్టడంతో ఐదు సెకన్ల పెనాల్టీ వేశారు. దాంతో హామిల్టన్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ)కు రెండో స్థానం... బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) మూడో స్థానం పొందారు. ఈ ప్రదర్శనతో నోరిస్‌ (20 ఏళ్ల 235 రోజులు) ఫార్ములావన్‌ చరిత్రలో పిన్న వయస్సులో పోడియం (టాప్‌–3)పై నిలిచిన మూడో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (18 ఏళ్ల 228 రోజులు), లాన్స్‌ స్ట్రోల్‌ (18 ఏళ్ల 240 రోజులు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రేసు ప్రారంభానికి ముందు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌తో కలిసి మరో 13 మంది డ్రైవర్లు మోకాలిపై నిల్చోని తమ సంఘీభావం తెలిపారు. సీజన్‌లోని రెండో రేసు ఇదే వేదికపై 10న జరుగుతుంది.

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్‌–10): 1. బొటాస్‌ (మెర్సిడెస్‌–25 పాయింట్లు); 2. చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ–18); 3. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌–16); 4. హామిల్టన్‌ (మెర్సిడెస్‌–12); 5. కార్లోస్‌ సెయింజ్‌ జూనియర్‌ (మెక్‌లారెన్‌–10); 6. పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌–8); 7. పియరీ గాస్లీ (అల్ఫా టౌరీ–6), 8. ఒకాన్‌ (రెనౌ–4); 9. గియోవినాజి (అల్ఫా రోమియో–2 పాయింట్లు), 10. వెటెల్‌ (ఫెరారీ–1 పాయింట్‌).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top