ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షరతులకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎట్టకేలకు తలొగ్గింది. ఫైనల్ మ్యాచ్ నిర్వహణను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరాదన్న ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ పాటించేందుకు అంగీకరించింది.
ఐపీఎల్ షరతులకు ఎంసీఏ అంగీకారం
ముంబై: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షరతులకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎట్టకేలకు తలొగ్గింది. ఫైనల్ మ్యాచ్ నిర్వహణను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరాదన్న ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ పాటించేందుకు అంగీకరించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌ను ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వాంఖడేలోకి అనుమతిస్తామని చెప్పింది. ‘ఫైనల్ మ్యాచ్ వాంఖడేలోనే జరగాలని మా అధ్యక్షుడు శరద్ పవార్ కోరుకుంటున్నారు.
అందుకే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విధించిన 14 షరతులకూ అంగీకరిస్తున్నాం. షారుఖ్ ఖాన్‌పై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఈ మ్యాచ్ వరకు తాత్కాలికంగా సడలిస్తున్నాం. వాంఖడేలో ఆయన ప్రవేశం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ స్పష్టం చేశారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యులైన గవాస్కర్, రవిశాస్త్రి ముంబై మాజీ ఆటగాళ్లే అయినందున వారు తమకు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తాజా పరిణామంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఎంసీఏనుంచి అధికారికంగా లేఖ వచ్చిన తర్వాత స్పందిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ చెప్పారు.