30 ఏళ్లలో మయాంక్‌ ఒక్కడే..

Mayank 1st Indian Opener In New Zealand In 30 Years - Sakshi

వెల్లింగ్టన్‌: టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు దశాబ్దాల తర్వాత ఓ రికార్డును లిఖించాడు. 30 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌ గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి సెషన్‌ అంతా బ్యాటింగ్‌ చేసిన మొదటి టీమిండియా ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. కివీస్‌తో  వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ రోజు ఆరంభమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా బ్యాటింగ్‌ను మయాంక్‌ అగర్వాల్‌-పృథ్వీషాలు ఆరంభించారు. ఆదిలోనే పృథ్వీ షా(16) పెవిలియన్‌ చేరగా, మయాంక్‌ మాత్రం నిలకడగా ఆడాడు. ఈ క్రమంలోనే తొలి సెషన్‌ అంతా బ్యాటింగ్‌ చేశాడు. లంచ్‌ సమయానికి అగర్వాల్‌ 29 పరుగులతో నాటౌట్‌గా మిగలడంతో న్యూజిలాండ్‌ గడ్డపై తొలి సెషన్‌ అంతా ఆడిన భారత ఓపెనర్‌ రికార్డును సాధించాడు. 

1990లో న్యూజిలాండ్‌లో వారితో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత మాజీ ఆటగాడు మనోజ్‌ ప్రభాకర్‌ ఓపెనర్‌గా దిగి తొలి సెషన్‌ అంతా క్రీజ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఇంతకాలానికి న్యూజిలాండ్‌ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో మొదటి సెషన్‌ అంతా క్రీజ్‌లో ఉన్న రికార్డును మయాంక్‌ నమోదు చేశాడు. లంచ్‌ తర్వాత మయాంక్‌-రహానేలు తిరిగి బ్యాటింగ్‌ ఆరంభించగా, మయాంక్‌(34) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు రెండో వికెట్‌గా చతేశ్వర్‌ పుజారా(11), మూడో వికెట్‌గా కోహ్లి(2)లు ఔటయ్యారు. దాంతో లంచ్‌లోపే భారత్‌ మూడు వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో మయాంక్‌తో రహానే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాల్గో వికెట్‌కు వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత మయాంక్‌ ఔట్‌ కాగా, అటు తర్వాత హనుమ విహారి(7) పెవిలియన్‌ చేరాడు. దాంతో 101 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లను నష్టపోయింది. అనంతరం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా మారడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ క్రమంలోనే తొలి రోజు ఆట పూర్తిగా జరగలేదు. మొదటి రోజు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. రహానే(38 బ్యాటింగ్‌), రిషభ్‌ పంత్‌(10 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జెమీసన్‌ మూడు వికెట్లు సాధించగా, టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్‌లు తలో వికెట్‌ తీశారు. (ఇక్కడ చదవండి: అతనేమీ సెహ్వాగ్‌ కాదు.. కానీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top