అందం అల్విదా చెప్పింది

Maria Sharapova Retires From Tennis - Sakshi

టెన్నిస్‌కు షరపోవా గుడ్‌బై

రిటైర్మెంట్‌ ప్రకటించిన రష్యా స్టార్‌

కెరీర్‌లో ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం   

ఆటతో పాటు అందం కూడా కలిసి నడిచే మహిళల టెన్నిస్‌లో ఒక శకం ముగిసింది. 16 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన రష్యన్‌ బ్యూటీ మారియా షరపోవా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గినా... వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించినా... తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ తన రాకెట్‌ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తన పేరుతో పెట్టిన క్యాండీ ‘షుగర్‌పోవా’లాగే ఎన్నో  తీపి జ్ఞాపకాలను పదిలపర్చుకొని వీడ్కోలు  పలుకుతున్నట్లు వెల్లడించింది.   

పారిస్‌: రష్యా టెన్నిస్‌ స్టార్, మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ మారియా షరపోవా ఆట నుంచి తప్పుకుంది. ‘టెన్నిస్‌–నేను గుడ్‌బై చెబుతున్నా’ అంటూ ప్రకటించింది. నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో ఆమె కూడా ఉండటం విశేషం. 32 ఏళ్ల షరపోవా కొన్నేళ్లుగా వరుస గాయాలతో సతమతమవుతోంది. కోలుకొని అప్పుడప్పుడూ బరిలోకి దిగుతున్నా ఫలితాలు అన్నీ ప్రతికూలంగా వచ్చాయి. ఒకప్పుడు వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు 373వ ర్యాంక్‌కు పడిపోయింది. దాంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో పుట్టినా... ఏడేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. ఆటలో మాత్రం రష్యాకు ప్రాతినిధ్యం వహించడాన్ని షరపోవా కొనసాగించింది. 2004 వింబుల్డన్‌ ఫైనల్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ను ఓడించి 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె చక్కటి ఆటకు అందం తోడై అత్యంత పాపులర్‌ ప్లేయర్‌గా షరపోవాకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. వరుసగా 11 ఏళ్ల పాటు అత్యధిక ఆర్జన ఉన్న మహిళా క్రీడాకారిణిగా ‘ఫోర్బ్స్‌’ జాబితాలో నిలిచింది.  

28 ఏళ్ల ఆట, 5 గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. వేరే రంగంలో పోటీ పడి మరింత ఎత్తుకు ఎదిగే సత్తా నాలో ఇంకా ఉంది. నేను నా జీవితాన్ని టెన్నిస్‌కు ఇస్తే టెన్నిస్‌ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఎంతగా శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు సాధించవచ్చని నేను నమ్మా. గతం గురించో, భవిష్యత్తు గురించో అతిగా ఆలోచించకుండా వర్తమానంలో కష్టపడటం వల్లే ఈ విజయాలు దక్కాయనేది నా భావన. టెన్నిస్‌ కోర్టుకు సంబంధించి అన్ని జ్ఞాపకాలూ పదిలంగా నా మనసులో ఉంటాయి. అవి కోల్పోతున్న బాధ నాకూ ఉంది. టెన్నిస్‌ అనేది నాకు శిఖరంలాంటిది. అక్కడికి చేరే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసినా ఒక్కసారిగా పైకి ఎక్కిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. ఇక ముందు కూడా జీవితంలో కొత్త లక్ష్యాలు పెట్టుకొని శ్రమిస్తా. మరిన్ని విజయాలు అందుకున్నా.
–వీడ్కోలు సందేశంలో షరపోవా   

మొత్తం గెలిచిన మ్యాచ్‌లు: 645
మొత్తం ఓడిన మ్యాచ్‌లు: 171
కెరీర్‌లో సాధించిన ప్రైజ్‌మనీ:  3,87,77,962 డాలర్లు  (రూ. 277 కోట్ల 76 లక్షలు)
షరపోవా సాధించిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌: 5

(2004–వింబుల్డన్‌; యూఎస్‌ ఓపెన్‌–2006; ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–2008; ఫ్రెంచ్‌ ఓపెన్‌–2012, 2014)
కెరీర్‌లో నెగ్గిన సింగిల్స్‌ టైటిల్స్‌ సంఖ్య: 36
అత్యుత్తమ ర్యాంకింగ్‌ (ఆగస్టు 22, 2005): 1
ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది: 2001
ప్రస్తుత ర్యాంక్‌: 373
కెరీర్‌లో   నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగిన వారాలు: 21

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top