మను–సౌరభ్‌ జంట బంగారు గురి

Manu Bhaker, Saurabh Chaudhary smash world record  - Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత పిస్టల్‌ షూటర్లు

న్యూఢిల్లీ: టీనేజ్‌ భారత షూటర్లు మను భాకర్‌–సౌరభ్‌ చౌధరీ ద్వయం ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టింది. ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. చైనీస్‌ తైపీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మను–సౌరభ్‌ ద్వయం విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 17 ఏళ్ల మను, 16 ఏళ్ల సౌరభ్‌ జతగా 784 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు విటాలినా బత్సరష్‌కినా–అర్తెమ్‌ చెర్ముసోవ్‌ (రష్యా–782 పాయింట్లు) పేరిట ఉండేది. ఫైనల్లో మను–సౌరభ్‌ జంట 484.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. హవాంగ్‌ సియోన్‌జెయున్‌–కిమ్‌ మోస్‌ (కొరియా–481.1 పాయింట్లు) జంట రజతం... వు చియా యింగ్‌–కు కువాన్‌ టింగ్‌ (చైనీస్‌ తైపీ–413.3 పాయింట్లు) జోడీ కాంస్యం గెల్చుకున్నాయి.   

ఇషా–విజయ్‌వీర్‌ జంటకు స్వర్ణం
ఇదే టోర్నీ జూనియర్‌ మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ తన భాగస్వామి విజయ్‌వీర్‌ సిద్ధూతో కలిసి స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఇషా–విజయ్‌వీర్‌ ద్వయం 478.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్‌లో ఇషా–విజయ్‌వీర్‌ జంట 769 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన హర్షద–అర్జున్‌ సింగ్‌ చీమా జోడీ 755 పాయింట్లతో ఫైనల్‌ చేరింది. అయితే ఫైనల్లో ఈ ద్వయం 375 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top