మన్మధ్‌ మెరిసె...

Manmadh Rebba, First Ultraman from South India - Sakshi

అల్ట్రామ్యాన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన తెలుగు తేజం

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన అల్ట్రామ్యాన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం రెబ్బా మన్మధ్‌ ఆకట్టుకున్నాడు. అమెరికాలోని హవాయిలో జరిగిన అత్యంత కఠినమైన ఈ రేసులో ప్రపంచ వ్యాప్తంగా పలువురు హేమాహేమీలు పాల్గొన్నారు. ఒక్కో రోజు ఒక్కో విభాగంలో జరిగిన ఈ పోటీని పూర్తి చేయడమే ఓ విశేషమైతే మన్మధ్‌ 26వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇది భిన్నమైందే కాదు... కఠినమైంది కూడా! మూడు రోజుల పాటు ‘ట్రయథ్లాన్‌’గా ఈ అల్ట్రామ్యాన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తారు. తొలి రోజు స్విమ్మింగ్‌తో చాలెంజ్‌ మొదలవుతుంది. ఏ వందో, రెండొందల మీటర్లనుకుంటే పొరపాటే. ఏకబిగిన 10 కిలోమీటర్లు స్విమ్మింగ్‌ చేయాలి. వెంటనే 145 కిలోమీటర్లకు పైగా బైక్‌ రేసు ఆ తర్వాత మరో 276 కిలోమీటర్ల బైక్‌ రేసు, చివరగా 84 కిలోమీటర్ల పరుగు పందెం ఉంటుంది. 40 మందికి పైగా ఇందులో పాల్గొంటే అటుఇటుగా కేవలం సగం మందే ఈ మూడు ఈవెంట్లను పూర్తి చేస్తారు.

అలాంటి క్లిష్టమైన ఈ పోటీని అమెరికాలో స్థిరపడిన 39 ఏళ్ల మన్మధ్‌ 33 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం. 30 నుంచి 39 ఏళ్ల వయోవిభాగంలో అతను పోటీపడ్డాడు. మొదటి రోజు స్మిమ్మింగ్‌తో పాటు 145 కి.మీ. బైక్‌ రేసును 10 గంటల 48 నిమిషాల్లో, రెండో రోజు 276 కి.మీ. పోటీని 11 గంటల 53 నిమిషాల్లో, చివరగా పరుగు పందెంను 10 గంటల 43 నిమిషాల్లో అతను పూర్తి చేశాడు. ఈ చాంపియన్‌షిప్‌లో 33 ఏళ్ల థామ్సన్‌ (22 గంటల 9 నిమిషాలు) విజేతగా నిలిచాడు. మన్మ«ద్‌కు అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. సవాళ్లతో కూడిన ఈవెంట్లలో గతంలోనూ పాల్గొని సత్తాచాటుకున్నాడు. ఐరన్‌ మ్యాన్, మియామి మ్యాన్, స్ప్రింట్‌ ట్రయథ్లాన్, ఎస్కేప్‌ ఫ్రమ్‌ అల్కట్రాజ్‌లాంటి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top