నువ్వు చేసిన తప్పు ఏమిటో జడేజాను అడుగు..!

Manjrekar Became Victim Of Social media Trolls Again - Sakshi

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల జరిగిన మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ రవీంద్ర  జడేజాపై కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘నువ్వొక గల్లీ క్రికెటర్‌వి. నీ ఆటను నేను ఇష్టపడను. జడేజా లాంటి బిట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు నేను ఫ్యాన్‌ను కాను. జడేజా టెస్టు క్రికెటర్‌ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్‌’ అని అన్నాడు. అంతేకాకండా జడేజాను తాను ఆల్‌ రౌండర్‌గా పరిగణించబోనంటూ పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో జడేజా చూపిన పోరాట స్ఫూర్తితో మంజ్రేకర్‌ను క్రికెట్‌ ఫ్యాన్స్‌ గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారు.

కాగా, మంజ్రేకర్‌ మరోసారి నెటిజన్లకు దొరికిపోయాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని అన్నా -చెల్లెల్ల బంధాన్ని చూపే ‘భాయ్‌ దూజ్‌’ వేడుకకు సంబంధించి మంజ్రేకర్‌ చేసిన ట్వీట్‌ విమర్శల పాలైంది. ‘ నా కుమారుడు చెల్లిలితో స్పీకర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డాడీ ఎలా తప్పు చేశాడో చెప్పాడు’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది.

‘నీ కుమారుడు నువ్వు తప్పు చేశావని చెప్పాడు కదా.. అదేంటో జడేజాను అడిగితే తెలుస్తుంది’ అని ఒకరు ట్వీట్‌ చేయగా, ‘ నువ్వు కామెంటెరీ బాక్స్‌లో కూర్చొని చేసిన వ్యాఖ్యలు నీ కుమారుడు విన్నాడేమో’ అని మరొకరు సెటైర్‌ వేశారు. ‘ జడేజాను తక్కువ చేసి మాట్లాడావు కదా.. అదే నీ కుమారుడు చెప్పాలనుకున్నాడేమో’ అని మరో అభిమాని ఎద్దేవా చేశాడు. ‘ నీ కామెంటరీ నీ కుమారుడికి నచ్చలేదేమో.. అప్పుడే నీ వ్యాఖ్యానాన్ని దూరం పెట్టడం ప్రారంభించాడని ఆశిస్తున్నా’ అని  మరొకరు విమర్శించారు. ఇలా సోషల్‌ మీడియాలో మంజ్రేకర్‌ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఏదో సరదాగా చేసిన ట్వీట్‌కు మంజ్రేకర్‌ మరోసారి బాధితుడయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top