భళా.. లబషేన్‌

Labuschagne Become First Substitution For Concussion - Sakshi

మలుపులతో సాగి ‘డ్రా’గా ముగిసిన యాషెస్‌ రెండో టెస్టు

 ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ అజేయ శతకం

దాదాపు రెండు రోజులు వర్షం అడ్డుకుంది. మరో రెండు రోజులు బౌలర్లు ఆడుకున్నారు. మధ్యలో స్టీవ్‌ స్మిత్‌ పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఆర్చర్‌ బుల్లెట్‌ బంతులతో బెంబేలెత్తించాడు. ఐదో రోజుకు వచ్చేసరికి ఓ దశలో ఫలితం తేలేలానూ కనిపించింది. కానీ; చరిత్రలో తొలిసారి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆసీస్‌ ఆటగాడు మార్నస్‌ లబషేన్‌ (100 బంతుల్లో 59; 8 ఫోర్లు) మరో మలుపు తిప్పాడు. ఆర్చర్‌ భీకర బౌలింగ్‌కు ఆరు ఓవర్ల పైగా ఎదురొడ్డి చివరకు ‘డ్రా’గా ముగిసేలా చేశాడు. లార్డ్స్‌ మైదానంలో యాషెస్‌ రెండో టెస్టు సాగిన తీరిది. విజయం కోసం పట్టువిడవకుండా ప్రయత్నించిన ఇంగ్లండ్‌ ఉసూరుమంటే... ఓటమి తప్పించుకున్న ఆస్ట్రేలియా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ అంటేనే ఉత్కంఠకు లోటు లేకుండా సాగే పోటాపోటీ మ్యాచ్‌లు. ఫలితం ‘డ్రా’నే అయినా... లార్డ్స్‌లో రెండో టెస్టు దీనికి ఏమాత్రం తగ్గకుండా నడిచింది. అదెలాగంటే... 8 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం; ఓవర్‌నైట్‌ స్కోరు 96/4తో ఆదివారం రెండో ఇన్సింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (165 బంతుల్లో 115 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన సెంచరీ సాయంతో 258/5 వద్ద డిక్లేర్‌చేసింది. అతడికి బట్లర్‌ (31), బెయిర్‌స్టో (30 నాటౌట్‌) సహకరించారు. దీంతో ఆసీస్‌ ఎదుట 48 ఓవర్లలో 267 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. కాస్త తెగించి వన్డే తరహాలో ఆడితే ఈ స్కోరు ఛేదించదగ్గదే. కానీ, గాయంతో ప్రధాన బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ దూరమవడంతో కంగారూలు ముందే ఆత్మ రక్షణలో పడ్డారు. మరోవైపు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (3/32); స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ (3/37) వారిని బెంబేలెత్తించారు. కీలకమైన ఓపెనర్‌ వార్నర్‌ (5), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఖాజా (2)లను ఆర్చర్‌ కుదురుకోనివ్వలేదు. మరో ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ (16)ను లీచ్‌ ఔట్‌ చేశాడు. 14 ఓవర్లలో 47/3తో ఓటమి బాటలో నిలిచిన ఆసీస్‌ను లబషేన్‌ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ట్రావిస్‌ హెడ్‌ (90 బంతుల్లో 42 నాటౌట్‌; 9 ఫోర్లు) అండగా జట్టును ఒడ్డున పడేశాడు. అయితే, లబషేన్, వేడ్‌ (1)లను లీచ్‌; కెప్టెన్‌ పైన్‌ (4)ను ఆర్చర్‌ వెంటవెంటనే ఔట్‌ చేసి అనూహ్యం చేసేలా కనిపించారు. హెడ్, కమిన్స్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌)లు ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. 154/6తో ఆసీస్‌ మ్యాచ్‌ను ముగించి బతుకుజీవుడా అంటూ బయటపడింది. మూడో టెస్టు 22 నుంచి హెడింగ్లీలో జరుగుతుంది.

తొలి కాంకషన్‌ లబషేన్‌...

శనివారం ఆర్చర్‌ బౌలింగ్‌లో గాయపడిన స్టీవ్‌ స్మిత్‌... తల నొప్పి కారణంగా ఆదివారం మైదానంలోకి దిగలేదు. దీంతో ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వెసులుబాటును ఆస్ట్రేలియా వినియోగించుకుంది. మ్యాచ్‌ రిఫరీ అనుమతితో స్మిత్‌ స్థానంలో ఆ జట్టు లబషేన్‌ను ఆడించింది. నిబంధనల ప్రకారం తల లేదా మెడ భాగంలో గాయాలతో మైదానంలోని ఒక ఆటగాడు దూరమైతే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్‌ చేయొచ్చు. గతంలో సబ్‌స్టిట్యూట్‌ను ఫీల్డింగ్‌ వరకే అనుమతించేవారు.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 258; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 250; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 258/5 డిక్లేర్డ్‌ (స్టోక్స్‌ 115 నాటౌట్‌; కమిన్స్‌ 3/35); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 154/6 (47.3 ఓవర్లలో).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top