శభాష్ కేఎల్‌ రాహుల్‌: అంపైర్‌ ప్రశంస

KL Rahuls honesty in field receives applause from umpire Ian Gould - Sakshi

సిడ‍్నీ: గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు పాలవుతూ వస్తున్న టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఇప్పడు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకూ తన ఆటతో విపరీతమైన విమర్శలు పాలైన రాహుల్‌ తాజాగా ప్రశంసించబడటానికి అతనే నిజాయితీనే కారణం. రాహుల్ పట్టిన ఒక క్యాచ్‌ విషయంలో అతను క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంతో ఒక్కసారిగా ‘సీన్‌’ మారిపోయింది.

నాలుగో టెస్టు మూడో రోజు 15వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. మొదటి బంతికే ఆసీస్‌ ఓపెనర్‌ హారిస్‌ మిడాన్‌ దిశగా షాట్‌ కొట్టాడు. అది నేరుగా ఫీల్డర్‌ కేఎల్‌ రాహుల్‌ వైపు వెళ్లింది. వెంటనే రాహుల్‌ అద్భుతమైన రీతిలో డైవ్‌ కొట్టి క్యాచ్‌ పట్టాడు. అందరూ అది ఔట్‌ అని అనుకున్నారు. కానీ, క్యాచ్‌కు ముందు బంతి నేలను తాకిన విషయాన్ని గ్రహించిన రాహుల్‌ అది క్యాచ్‌ కాదంటూ చేతులను ఊపుతూ సిగ్నల్‌ ఇచ్చి నిజాయతీని చాటుకున్నాడు.  ఆ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా.. రాహుల్‌ వద్దకు వచ్చి తలపై తడుతూ మెచ్చుకున్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌ కూడా రాహుల్‌ నిజాయతీకి మెచ్చి.. ‘శభాష్‌ రాహుల్‌.. ఇది క్రీడా స్ఫూర్తి. కీప్‌ ఇట్‌ అప్‌’ అంటూ వికెట్ల వద్ద నుంచే రాహుల్‌ను కొనియాడాడు.

రాహుల్‌ క్రీడాస్ఫూర్తికి పలువురు క్రికెట్‌ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. రాహుల్‌ తన నిజాయతీని చాటుకున్నాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘రాహుల్‌ క్రీడా స్ఫూర్తి మిగతా ఆటగాళ్లకు అనుసరణీయం’ అని ఒక అభిమాని ప్రశంసించగా, ‘చీటింగ్‌కు పాల్పడే ఆటగాళ్లు రాహుల్‌ నుంచి ఎంతో నేర్చుకోవాలి’ అని మరొకరు పేర్కొన్నారు. ‘అంపైర్‌ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే రాహుల్‌ స్పందించడం నిజంగా గ్రేట్‌’ అని మరొక అభిమాని కొనియాడాడు. ఇలా రాహుల్‌ విమర్శల బాట నుండి ప్రశంసలు అందుకోవడం టీమిండియా శిబిరంలో జోష్‌ నింపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top