ధోని కంటే తోపు ఎవడూ లేడు..!

Kapil Dev makes a big statement on MS Dhoni - Sakshi

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అంచనాల మించి రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. ప్రధానంగా ధోనిలో పస అయిపోయింది అనుకునే వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.  గత రెండు రోజుల క్రితం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడనే చెప్పాలి.  48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు సాధించాడు. అందులో చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 26 పరుగులు కావాల్సిన సమయంలో ధోని ఆడిన తీరు తన పాత ఆటను గుర్తుకు తెచ్చింది. ఆ ఓవర్‌లో తొలి ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో కలుపుకుని మొత్తంగా 24 పరుగులు సాధించాడు.

ఆఖరి బంతికి ధోని లైన్‌ మిస్‌ కావడంతో ఆర్సీబీ ఊపిరిపీల్చుకుంది. ఆ మ్యాచ్‌ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. తమను ధోని చాలా భయపెట్టాడంటూ మనసులోని మాట బయటపెట్టేశాడు కూడా. ఇప్పుడు భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ సైతం ధోనిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. అసలు ధోని తరహా క్రికెట్‌ ఆడే క్రికెటర్‌ భారత్‌లో ఎవడూ లేడంటూ అతి పెద్ద కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడు. ‘ ధోని గురించి ఏమీ మాట్లాడినా తక్కువే. అతని గురించి నేను మాటల్లో ఏమి వర్ణించలేను. నా దృష్టిలో దేశం కోసం ఎక్కువ సేవ చేస్తున్న క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినే. సుదీర్ఘకాలంగా జట్టుకు ఆడుతూ, మరొకవైపు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమంటే అంత సులభం కాదు.  ధోని తరహాలో అటు గేమ్‌పై ఇటు ఫిట్‌నెస్‌పై దృష్టి నిలపాలంటే ఎవరికైనా భారంగానే ఉంటుంది. ధోని కంటే ఎక్కువగా దేశం కోసం సేవ చేసిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే నా కోణంలో ఎవరూ లేరనే చెప్పాలి. అతనికి మనం అత్యంత గౌరవం ఇవ్వడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. వచ్చే వరల్డ్‌కప్‌లో కూడా ధోని కీలక పాత్ర పోషించడం ఖాయం’ అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: ఎవడ్రా అక్కడ.. ధోనికి వయసు అయిపోయిందన్నది!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top