భారత బాక్సర్ల పతకాల పంట

Junior girls set Polish rings on fire, bag 13 medals including 6 gold - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిలేసియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. పోలండ్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యంతో ఓవరాల్‌గా 13 పతకాలతో దుమ్మురేపారు. భారత బాక్సర్లు పోటీపడ్డ 13 విభాగాల్లోనూ పతకాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్స్‌లో భారతి (46 కేజీలు) 5–0తో ఇజాబెలా (పోలాండ్‌)పై; టింగ్‌మిలా డౌన్‌జెల్‌ (48 కేజీలు) 5–0తో ఎలైన (జర్మనీ)పై; సందీప్‌ కౌర్‌ (52 కేజీలు) 5–0తో కరోలినా అమ్‌పుల్‌స్కా (పోలాండ్‌)పై; నేహా (54 కేజీలు) 3–2తో నికోలినా (లాత్వియా)పై; జైబురా (పోలాండ్‌)పై కోమల్‌ (80 కేజీలు); లియోన (స్వీడన్‌)పై అర్షి (57 కేజీలు) విజయం సాధించి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.

అమీశ (50 కేజీలు) 0–5తో అలెక్సెస్‌ (పోలాండ్‌) చేతిలో, సాన్య నేగీ (60 కేజీలు) 2–3తో థెల్మా (స్వీడన్‌) చేతిలో, ఆశ్రేయ (63 కేజీలు) 1–4తో నైనా (సెర్బియా) చేతిలో, మితిక (66 కేజీలు) 2–3తో నటాలియా (పోలండ్‌) చేతిలో, రాజ్‌ సాహిబా (70 కేజీలు) 0–5తో జోఫియా (పోలాండ్‌) చేతిలో, లేపాక్షి (ప్లస్‌ 80 కేజీలు) 0–5తో ఓలీవియా (పోలాండ్‌) చేతిలో ఓడి రజతాలు దక్కించుకున్నారు. 75 కేజీల వెయిట్‌ కేటగిరీ సెమీఫైనల్లో నేహా 0–5తో పారడా డైరా (పోలాండ్‌) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top