జబీర్‌ ముందంజ

Jabir Through To Semifinals at World Athletics Championship - Sakshi

400మీ. హర్డిల్స్‌లో సెమీస్‌కు చేరిన భారత అథ్లెట్‌

క్వాలిఫయింగ్‌లో లాంగ్‌ జంపర్‌ శంకర్‌ నిష్క్రమణ

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

దోహా: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ కాస్త ఆశాజనకంగా ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభ ఈవెంట్‌ లాంగ్‌జంప్‌లో భారత ఆశాకిరణం శ్రీ శంకర్‌ మురళీ నిరాశపరిచినా... 400మీ. హర్డిల్స్‌లో మదారి పిళ్లై జబీర్‌ ముందంజ వేశాడు. పోటీల తొలిరోజు శుక్రవారం 400మీ. హర్డిల్స్‌ తొలి హీట్స్‌లో పాల్గొన్న జబీర్‌ మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. అతను 49.62 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత ఆటగాడు ధరుణ్‌ అయ్యసామి హీట్స్‌లోనే వెనుదిరిగాడు. ధరుణ్‌ 50.93 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... ఎనిమిది మంది పాల్గొన్న హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత పొందుతారు. మరోవైపు లాంగ్‌జంప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు శ్రీ శంకర్‌ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు.

20 ఏళ్ల ఈ యువ లాంగ్‌ జంపర్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అత్యుత్తమంగా కేవలం 7.62 మీ. మాత్రమే జంప్‌ చేశాడు  27 మంది పాల్గొన్న ఈ పోటీల్లో 22వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 7.52మీ. జంప్‌ చేసిన అతను రెండో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా 7.62మీ. నమోదు చేశాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో ఫౌల్‌గా వెనుదిరిగాడు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టాప్‌–12లో స్థానం దక్కించుకోవాల్సి ఉంటుంది. లేదా నిర్దేశిత ప్రమాణం 8.15మీ. జంప్‌ చేయాలి. శంకర్‌ పేలవ ప్రదర్శనతో పోటీల నుంచి ని్రష్కమించాడు. నేడు జరిగే పోటీల్లో భారత్‌ నుంచి 100మీ. మహిళల హీట్స్‌లో ద్యుతీచంద్, పురుషుల 400మీ. హర్డిల్స్‌ సెమీఫైనల్లో జబీర్‌... పురుషుల 4గీ400మీ. మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌లో భారత జట్టు బరిలో దిగుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top