
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు కలిదిండి ఇషిత రాజు, చిట్టబోయిన రోహిత్ యాదవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో రోహిత్ యాదవ్ 21–15, 21–18తో మనీశ్ గుప్తా (భారత్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ఇషిత రాజు 21–17, 24–22తో వైష్ణవి (భారత్)పై విజయం సాధించింది.
గురువారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మెయిన్ ‘డ్రా’ మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు గుమ్మడి వృశాలి, గద్దె రుత్విక శివాని, జక్కా వైష్ణవి రెడ్డి, చుక్కా సాయి ఉత్తేజిత రావు, కుదరవల్లి శ్రీకృష్ణప్రియ... పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు రాహుల్ యాదవ్, ఎన్‌వీఎస్ విజేత, అజయ్ కుమార్ పోటీపడనున్నారు.