భారత వాకిట్లో అఫ్గాన్‌ చరిత్ర

 Irresistible Rise of Afghanistan's Cricket Team - Sakshi

చిరస్మరణీయ పోరుకు రంగం సిద్ధం

నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్‌ టెస్టు 

పటిష్టంగా టీమిండియా

మ్యాచ్‌కు పొంచివున్న వర్షం ముప్పు

అంకెల పరంగా చూస్తే క్రికెట్‌ చరిత్రలో ఇది 2307వ టెస్టు మ్యాచ్‌ మాత్రమే. పోలికను బట్టి చూస్తే ఇరు జట్ల మధ్య భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంది. కానీ ఇది ఒకానొక టెస్టు మ్యాచ్‌ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఈ పోరులో గెలుపు మాత్రమే తుది లక్ష్యం కాదు. ఈ తరంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచే పోరాట కథలు ఈ రోజు ఆట వెనుక దాగి ఉన్నాయి. కోట్లాది ప్రజల భావోద్వేగాలు దీంతో ముడిపడి ఉన్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం స్వదేశంలో శతఘ్నుల సవాళ్ల నుంచి బయటకు వచ్చి వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌ ఫైవ్‌లో విజేతగా నిలిచిన రోజు ప్రపంచ క్రికెట్‌ చూపు అఫ్గానిస్తాన్‌పై పడింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలతో దూసుకొచ్చిన ఆ జట్టు ఇప్పుడు టెస్టు టీమ్‌గా తొలిసారి బరిలోకి దిగనుంది. తమ ఆట స్థాయిని పెంచడంలో అన్ని విధాలా అండగా నిలిచిన భారత్‌తోనే ఆ జట్టు మొదటి పోరులో తమ సత్తాను పరీక్షించుకోబోతోంది.  సొంతగడ్డపై ఆడుతున్న నంబర్‌వన్‌ టెస్టు టీమ్‌ భారత్‌ అన్ని విధాలా దుర్బేధ్యంగా ఉంది. అలాంటి జట్టును ఐదు రోజుల ఆటలో ఎదుర్కోవడం తొలి టెస్టు ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు అతి పెద్ద పరీక్ష. టి20ల్లో, వన్డేల్లో అప్పుడప్పుడు సంచలనాలు సాధించినా, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కనీస అనుభవం కూడా లేని ఆటగాళ్లతో ఆ జట్టు ఏమాత్రం నిలబడుతుందో చూడాలి. 

బెంగళూరు: ప్రపంచ క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని రేపిన టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో నేటి నుంచి జరిగే ఏకైక టెస్టులో భారత్‌తో అఫ్గానిస్తాన్‌ తలపడుతుంది. ఐసీసీ ఇటీవల టెస్టు హోదా ఇచ్చిన రెండు దేశాల్లో ఐర్లాండ్‌ కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్‌తో తలపడగా... 12వ జట్టుగా ఇప్పుడు అఫ్గాన్‌ వంతు వచ్చింది. బలాబలాలపరంగా భారత్‌ అందనంత ఎత్తులో ఉండగా, అఫ్గాన్‌ టెస్టు స్థాయి అంచనా వేసేందుకు ఈ మ్యాచ్‌ అవకాశం కల్పించనుంది. కోహ్లి దూరం కావడంతో అజింక్య రహానే టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.  

నాయర్‌కు చాన్స్‌... 
ముగ్గురు ప్రధాన ఓపెనర్లు ధావన్, విజయ్, రాహుల్‌ అందుబాటులో ఉండగా ఇద్దరిని ఎంచుకోవడంలో ఇటీవల భారత్‌కు పెద్దగా సమస్య ఎదురు కాలేదు. ఒకరు గాయపడటమో లేదా మరో కారణం వల్లో ఇది సాగిపోయింది. ఇప్పుడు ముగ్గురు పోటీలో నిలిచారు. అయితే మంగళవారం సాయంత్రం ప్రాక్టీస్‌ సెషన్‌ సమయంలో ధావన్‌ ఫిజియోలతో సుదీర్ఘంగా చర్చించడం చూస్తే ఫిట్‌నెస్‌ సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే విజయ్, రాహుల్‌ బరిలోకి దిగడం ఖాయం. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడిన రాహుల్, అంతకుముందు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో మాత్రం విఫలమయ్యాడు. అయితే సొంతగడ్డపై అతనికి ఈసారి ఇబ్బంది ఉండకపోవచ్చు. మరో లోకల్‌ ప్లేయర్‌ కరుణ్‌ నాయర్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కోహ్లి గైర్హాజరులో మిడిలార్డర్‌లో నాయర్‌కు చోటు లభిస్తుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత దినేశ్‌ కార్తీక్‌ టెస్టు బరిలోకి దిగబోతుండగా... హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాల్సి ఉంది. భువనేశ్వర్, బుమ్రా టెస్టుకు దూరం కాగా, తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఇద్దరు పేసర్లుగా ఉమేశ్, ఇషాంత్‌ ఉంటారు కాబట్టి నవ్‌దీప్‌ సైనికి అరంగేట్రం కష్టమే. సొంతగడ్డపై అశ్విన్, జడేజాల రికార్డు చూస్తే భారత్‌ మూడో స్పిన్నర్‌ ఆలోచన చేయకపోవచ్చు.  

నిలబడతారా... 
టి20ల్లో 4 ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసినంత సులువు కాదు టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘ సమయం పాటు అంతే క్రమశిక్షణతో, పట్టుదలతో బౌలింగ్‌ చేసి వికెట్లు పడగొట్టడం! సంచలన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు ఇప్పుడు అలాంటి పరీక్షే ఎదురవుతుంది. అత్యంత పటిష్టమైన భారత బ్యాటింగ్‌ను రషీద్‌ తన లెగ్‌స్పిన్‌తో నిరోధిస్తాడని అఫ్గాన్‌ ఆశ పడుతోంది. 4 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవం ఉన్న రషీద్,  ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ కూడా ఆడని ఆఫ్‌ స్పిన్నర్‌ ముజీబ్, మరో స్పిన్నర్‌ ఆమిర్‌ హమ్జాలతో అఫ్గాన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం మాత్రం ఉంది. వీరికి తోడుగా ఆల్‌రౌండర్‌ నబీ ఉన్నాడు. అయితే ఆ జట్టు ప్రధాన బలహీనత బ్యాటింగ్‌. ఇటీవల టెస్టుల్లో పెద్ద పెద్ద జట్లే సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్‌ చేయలేక కూలిపోతుండగా... ఈ టీమ్‌ ఎంత సేపు పట్టుదలగా నిలబడుతుందనేదే కీలకం.   

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రహానే (కెప్టెన్‌), విజయ్, రాహుల్, పుజారా, నాయర్, కార్తీక్, పాండ్యా, అశ్విన్, జడేజా, ఇషాంత్, ఉమేశ్‌.  
అఫ్గానిస్తాన్‌: అస్గర్‌ స్తానిక్‌జై (కెప్టెన్‌), షహజాద్,  జావేద్‌ అహ్మదీ, రహ్మత్‌ షా, నాసిర్‌ జమాల్, నబీ, అఫ్సర్‌ జజై, రషీద్‌ ఖాన్, ఆమిర్‌ హమ్జా, యమిన్‌ అహ్మద్‌జై, ముజీబ్‌.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top