
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్(ఈపీఎల్)లా ఆటగాళ్లు జట్టును మార్చుకునే ‘మిడ్ డే టోర్నమెంట్ ప్లేయర్ ట్రాన్స్‌ఫర్’ నిబంధనను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈపీఎల్ నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాడికి సీజన్‌లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా ఇతర జట్లలోకి వెళ్లవచ్చు. అయితే ఇతర జట్టు అవకాశం కల్పించినపుడే ఇది సాధ్యమవుతుంది.
ఇదే నిబంధన ఐపీఎల్-11 సీజన్‌లో అమలు చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. మంగళవారం జరిగిన బీసీసీఐ- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఆ పత్రిక ప్రచురించింది. ఈ నిర్ణయానికి ప్రాంచైజీ యజమానులు అంగీకరించారని కూడా పేర్కొంది.