ఐపీఎల్‌ ఫైనల్‌ టికెట్లపై అనుమానాలు?

IPL Fans Doubt On Final Match Tickets Sales - Sakshi

హైదరాబాద్‌:  స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో రేపు జరగబోయే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకోవాలనుకున్న నిర్వాహకులు టికెట్లను హాంఫట్‌ అనేశారు. సాధారణంగా మ్యాచ్‌ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ. కానీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఆ ఆనవాయితీని నిర్వాహకులు పక్కకు పెట్టారు.  ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టిక్కెట్లను పద్దతి ప్రకారమే అందుబాటులో పెట్టిన నిర్వాహకులు.. ఫైనల్‌ మ్యాచ్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండానే టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను ఈవెంట్స్ .కామ్‌ సంస్థ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఆ సంస్థ రెండు నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది.

అయితే వెబ్‌సైట్‌లో కేవలం ఎక్కువ ధరల టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారని కామన్‌ టికెట్ల సంగతేంటని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు....? ఎన్ని అమ్ముడయ్యాయి...? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు....? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయంపై ఈవెంట్స్‌నౌ ప్రతినిధిలు నోరు మెదుపటం లేదు. ఇక హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఈ వివాదంపై స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఐపీఎల్‌ ఫైనల్‌ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐతే ఈవెంట్స్‌నౌ.కామ్‌ గానీ.. హెచ్‌సీఏ గానీ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్‌సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్‌నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. కొన్ని నిమిషాల వ్యవధిలో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని హెచ్‌సీఏ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top