‘భారత్-పాక్‌ మ్యాచ్‌.. ఫైనల్‌కు ముందు ఫైనల్‌’

Inzamam-ul-Haq Appeal to People To See It as Game - Sakshi

మాంచెస్టర్‌: వన్డే ప్రపం​చకప్‌లో భాగంగా రేపు భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల్లో వేడి మొదలైంది. ఈ మ్యాచ్‌ను ఫైనల్‌కు ముందు ఫైనల్‌గా పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌-ఉల్‌-వుక్‌ వర్ణించాడు. ఆటను ఆటగానే  చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

‘ప్రపంచకప్‌లో ఎప్పుడు ఇండియా-పాకిస్తాన్‌ జరిగినా ఫైనల్‌కు ముందు ఫైనల్‌గా ఉంటుంది. రెండు దేశాల క్రీడాభిమానులు చాలా ఉద్వేగంగా ఉంటారు. స్టేడియంలో 24 వేల మంది ప్రత్యక్ష్యంగా చూసే వీలుంది. కానీ ఏకంగా 8 లక్షల మంది టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. దీనిబట్టే అర్థమవుతోంది ఈ మ్యాచ్‌కు ఎంత కేజ్ ఉందో! గత మ్యాచ్‌లను పక్కన పెడితే రేపటి మ్యాచ్‌లో ఎవరు బాగా ఆడతానేది ముఖ్యం. పాకిస్తాన్‌ టీమ్‌ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ప్రేక్షకులకు ఈ మ్యాచ్‌ మంచి వినోదాన్ని అందించాలని అనుకుంటున్నాను. ప్రస్తుత టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచిన మా జట్టుకు రేపటి మ్యాచ్‌లో అదృష్టం కలిసొస్తుందని ఆశిస్తున్నాను.

ప్రపంచకప్‌లో భారత్‌ను పాకిస్తాన్‌ ఓడించలేదు కాబట్టి మా జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఇది పెద్ద మ్యాచ్‌, ఇలాంటి మ్యాచ్‌ల్లో ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఎంత బాగా ఆడితే అంత సంతృప్తి లభిస్తుంది. అభిమానులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఆటను ఆటగానే చూడండి. కోహ్లి ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు. అతడు గొప్ప క్రికెటర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సమతూకంగా ఉన్న టీమిండియా ఈ టోర్నమెంట్‌లో బాగా ఆడుతోంది. పాకిస్తాన్‌ ప్రతిసారి బౌలర్ల బలంపైనే ఆధారపడుతుంది. మా బౌలర్లను తక్కువ అంచనా వేయొద్ద’ని ఇంజమామ్‌ అన్నాడు. ఫైనల్లో ఏయే జట్లు ఆడతాయని ప్రశ్నించగా పాకిస్తాన్‌ కచ్చితంగా ఉంటుందని సమాధానమిచ్చాడు. (చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. వర్షం గెలిచేట్టుంది!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top