వ్యాక్సిన్‌ వచ్చాకే టోర్నమెంట్‌లు

International hockey can resume only after COVID vaccine is developed - Sakshi

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటన

లుసానే: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాకే అంతర్జాతీయ హాకీ టోర్నీలు జరుగుతాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) స్పష్టం చేసింది. ఈమేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం ‘ఐదు దశల ప్రక్రియ’ను అనుసరించబోతున్నామని ఎఫ్‌ఐహెచ్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ‘ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం.

తొలుత సామాజిక దూరం పాటిస్తూ శిక్షణను ప్రారంభిస్తాం. మరో దశలో రీజియన్ల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. తదుపరి పొరుగు దేశాల్లో జరిగే టోర్నీల్లో తలపడతాం. ఆ తర్వాత ఖండాంతర పోటీలు... ఇలా చివరి దశలో వ్యాక్సిన్‌ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం. అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఎఫ్‌ఐహెచ్‌ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని ఎఫ్‌ఐహెచ్‌ తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top