సమాధానం లభించలేదు 

Indian team has not clear on the middle-order - Sakshi

భారత జట్టు మిడిలార్డర్‌పై ఇంకా రాని స్పష్టత

ఆసియా కప్‌లో  అంతంత మాత్రం ప్రదర్శన  

ఓపెనర్‌గా, మూడో స్థానంలో అంబటి రాయుడు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. కానీ ఆ రెండు స్థానాల్లో మున్ముందు అతనికి అవకాశమే లేదు. మూడు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్‌ కార్తీక్‌ ఐదు ఇన్నింగ్స్‌లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు. సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నా, కేదార్‌ జాదవ్‌ బ్యాటింగ్‌ సత్తా బయట పడనే లేదు. అతిథి పాత్రలో రాహుల్‌ ఒకే మ్యాచ్‌కు పరిమితం కాగా, మనీశ్‌ పాండే వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వృథా చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అజేయ ప్రదర్శనతో చాంపియన్‌గా నిలవడంతో సమష్టి పాత్ర కనిపిస్తున్నా... టోర్నీకి ముందు తీవ్రంగా చర్చ జరిగిన మిడిలార్డర్‌ సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా నాలుగు, ఆరు స్థానాల్లో ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత రాలేదు.  

సాక్షి క్రీడా విభాగం:‘జట్టులో కొందరు ఆటగాళ్లు నాలుగు, ఆరు స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నారని చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. రాబోయే మరికొన్ని టోర్నమెంట్‌లలో వారి ప్రదర్శన తర్వాతే ఆయా ఆటగాళ్లు ఏమాత్రం పనికొస్తారని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయిస్తుంది’ అని ఆసియా కప్‌ ఫైనల్‌ అనంతరం రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్య తాజా పరిస్థితిని సూచిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు నాలుగు, ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, దాని కోసం పోటీ పడుతున్న బ్యాట్స్‌మెన్‌పై అనూహ్యంగా వేటు వేయకుండా వీలైనన్ని అవకాశాలు కల్పిస్తానని చెప్పిన తాత్కాలిక కెప్టెన్‌ తన మాట నిలబెట్టుకున్నాడు. అయితే తుది ఫలితం మాత్రం అతను అనుకున్న విధంగా రాలేదని అర్థమవుతోంది. కీలక మ్యాచ్‌లలో భారత టాప్‌–3 (కోహ్లి వచ్చాక) విఫలమైతే పరిస్థితి ఏమిటనే దానికి మాత్రం పరిష్కారం ఆసియా కప్‌లోనూ లభించలేదు. బంగ్లాదేశ్‌తో ఫైనల్లో 223 పరుగులను అందుకునేందుకు మన జట్టు తడబడ్డ తీరు ప్రపంచకప్‌ దిశగా సన్నద్ధమవుతున్న సమయంలో హెచ్చరికలాంటిదే.  

గెలిపించేదెవరు? 
రోహిత్, ధావన్, కోహ్లి సమష్టిగా విఫలమైతే భారత జట్టు పరిస్థితి ఏమిటనేదానికి అతి పెద్ద ఉదాహరణ గత ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌. ఆ మ్యాచ్‌లో ఈ ముగ్గురు 0, 21, 5 పరుగులు చేశారు. జట్టు చిత్తుగా ఓడి పాక్‌కు ట్రోఫీ అప్పగించింది. అది అరుదైన సందర్భమే కావచ్చు కానీ నాటి నుంచి కూడా మన మిడిలార్డర్‌ తడబాటు జట్టుకు సమస్యగానే మారింది. నాలుగు నుంచి ఏడు స్థానాల వరకు ఫలానా ఆటగాడు బలంగా నిలబడిన గెలిపించగలడు అని ఎవరినీ నమ్మలేని స్థితి. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి గణాంకాలు చూస్తే మన మిడిలార్డర్‌ (ఆటగాళ్లు మారినా) పరుగుల స్కోరింగ్‌ రేటు 4.82 మాత్రమే. ప్రపంచ కప్‌ ఆడబోతున్న మొత్తం పది జట్లలో మనకంటే అధ్వాన్నంగా (4.66) అఫ్గానిస్తాన్‌ మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఆసియా కప్‌ వరకు చూస్తే మన అంబటి రాయుడు అందరికంటే కాస్త మెరుగ్గా కనిపించాడు. హాంకాంగ్, అఫ్గానిస్తాన్‌లపై అతను అర్ధ సెంచరీలు చేశాడు. ఫైనల్లో మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ వరుసగా చేసిన స్కోర్లు 33, 31 నాటౌట్, 1 నాటౌట్, 44, 37 అతనిపై నమ్మకం పెంచలేకపోతున్నాయి. నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్లో సిక్సర్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసిన కార్తీక్‌ ఆ తర్వాత ఒక్క కీలక ఇన్నింగ్స్‌ కూడా ఆడలేకపోయాడు. ఇంగ్లండ్‌లో వైఫల్యంతో టెస్టుల్లో తన స్థానాన్ని పంత్‌కు చేజార్చుకున్న అతని వన్డే కెరీర్‌ కూడా ఇప్పుడు ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. ఏదోలా ఫైనల్‌ను జాదవ్‌ ముగించగలిగినా, అతని ఫిట్‌నెస్‌ కొత్త సమస్యను ముందుకు తెచ్చింది. ఐపీఎల్‌లో గాయపడిన తర్వాత సుదీర్ఘ సమయం ఎన్‌సీఏలో గడిపి ఫిట్‌గా తిరిగొచ్చిన అతను మళ్లీ కండరాల నొప్పితో ఇబ్బంది పడటం ఫిజియో పనితీరుపై కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. ఫైనల్‌ ముగిసిన తర్వాత తాను ప్రధానంగా బ్యాట్స్‌మన్‌ను అని స్వయంగా చెప్పుకున్న జాదవ్‌ ప్రస్తుతం ప్రత్యేక శైలి బౌలర్‌గానే జట్టులో ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప బ్యాట్స్‌మన్‌లా కాదు.  

ధోని పరిస్థితి ఏమిటి? 
ఆసియా కప్‌కు ముందే ఐదో స్థానం గురించి రోహిత్‌ స్పష్టత ఇచ్చేశాడు. అది ధోని కోసమేనని అర్థమైపోయింది. కానీ ఈ టోర్నీలో ధోని ఆట చూస్తే అతని వీరాభిమానులు కూడా ‘సమయం వచ్చేసింది’ అని భావిస్తున్నట్లుగా అనిపించింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 77 పరుగులే చేశాడు.  ప్రతీ పరుగు కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో ఫైనల్లో మరోసారి కనిపించింది. కేవలం 62.09 స్ట్రైక్‌ రేట్‌ ఉండటం, 124 బంతులు ఆడితే మొత్తంగా 6 ఫోర్లు తప్ప ఒక్క సిక్సర్‌ కూడా లేకపోవడం ధోని స్థాయి మాత్రం కాదు. కచ్చితంగా ప్రపంచ కప్‌ వరకు ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో 327 వన్డేల అనుభవజ్ఞుడు మిడిలార్డర్‌లో ఇలా ఆడితే కష్టమే. ఇక అన్ని ఫార్మాట్‌లకు తగిన విధంగా అద్భుతమైన ఆట ఉన్నా కేఎల్‌ రాహుల్‌ను మిడిలార్డర్‌లో మాత్రం ఆడించలేమని ఈ టోర్నీ ద్వారా మేనేజ్‌మెంట్‌ తేల్చేసినట్లుంది. అందుకే ఒక్కసారి కూడా మిడిల్‌లో ఆడించే ప్రయత్నం చేయలేదు. ఇతర ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతను 60 పరుగులు చేసినా అవి అతనికి ఎలాగూ టాప్‌–3లో అవకాశం కల్పించలేవు. మనీశ్‌ పాండే వ్యథ మరో రకం. దేశవాళీ అద్భుత ప్రదర్శనతో జట్టులోకి రావడం, ఆపై సుదీర్ఘ కాలం బెంచ్‌పై ఉండటం, ఏదో పుష్కరానికి ఒకసారి మ్యాచ్‌ దక్కితే పరిస్థితులను అర్థం చేసుకునేలోపే లేదంటే ఒత్తిడిలో ఔట్‌ కావడం రొటీన్‌గా మారింది. నిజానికి పై అందరికంటే అసలైన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా పాండేకే ఎక్కువ గుర్తింపు ఉంది. తన కెరీర్‌ 18 ఇన్నింగ్స్‌లలో అతను 4, 5, 6 స్థానాల్లోనే ఆడాడు. కానీ అతనికి వరుసగా అవకాశాలు మాత్రం దక్కడం లేదు.  

కొత్తగా ప్రయత్నిస్తారా... 
నిజాయితీగా చెప్పాలంటే ఆసియా కప్‌ను మన బౌలర్లు గెలిపించారు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థికి భారీ స్కోరుకు అవకాశం లేకుండా చేశారు. అందు వల్లే బ్యాట్స్‌మెన్‌ పని కొంత సులువుగా మారింది. ప్రతీ సారి టాప్‌–3నే మ్యాచ్‌లు గెలిపించడం సాధ్యం కాదు కాబట్టి వీలైనంత తొందరగా మిడిలార్డర్‌ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిందే. ఇప్పటి వరకు ప్రస్తావించిన పేర్లే కాకుండా మరోసారి అజింక్య రహానే కూడా పోటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. దూకుడు తక్కువ కాబట్టి వన్డేలకు పనికి రాడంటూ ప్రస్తుతానికి అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. కానీ ఇంగ్లండ్‌ పిచ్‌లపై మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను నడిపించాలంటే సాంకేతికంగా బలమైన బ్యాట్స్‌మన్‌ అవసరం. అది రహానేలో ఉంది. నిజంగా సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తే వచ్చే సిరీస్‌నుంచే అతడిని ఎంపిక చేసి వరుసగా ఆడించాలి. వీరందరినీ కాదని దేశవాళీలో మెరుగ్గా ఆడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌లాంటి వారిని కూడా ప్రయత్నిస్తారా అనేది రాబోయే వెస్టిండీస్‌ సిరీస్‌లో కొంత వరకు తేలుతుంది. దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడగల సత్తా రిషభ్‌ పంత్‌లో కూడా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా ఆసియా కప్‌లో భారత్‌ విజేతగా నిలిచినా మిడిలార్డర్‌ సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందనేది వాస్తవం. 
  
నేనూ ధోనిలాంటివాడినే:  రోహిత్‌ శర్మ
దుబాయ్‌: తొలిసారి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన టోర్నీలోనే రోహిత్‌ శర్మ భారత జట్టుకు టైటిల్‌ అందించాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన అనంతరం అతను మాట్లాడుతూ మైదానంలో ప్రశాంతంగా వ్యవహరించే విషయంలో తాను ధోనినే అనుకరిస్తున్నట్లు చెప్పాడు. ‘కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాకుండా కొంత సమయం తీసుకోవడం ఇన్నేళ్లుగా నేను ధోనిలో చూశాను. నాలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను కూడా ముందుగా ఆలోచించి ఆ తర్వాతే స్పందిస్తాను. వన్డేల్లో అలాంటి అవకాశం కూడా   ఉంటుంది. అతని నాయకత్వంలో చాలా కాలం ఆడాను.నాకు ఎప్పుడు సలహాలు, సహకారం కావాలన్నా అందించేందుకు అతను ఎప్పుడూ ముందుంటాడు’ అని రోహిత్‌ వెల్లడించాడు. మరోవైపు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ కెప్టెన్సీ అవకాశం దక్కినా ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు తాను సిద్ధమని రోహిత్‌ స్పష్టం చేశాడు. ‘కచ్చితంగా. ఇప్పుడే మేం విజయం సాధించాం. ఇకపై కూడా ఎప్పుడు కెప్టెన్సీ అవకాశం లభించినా నేను రెడీ’ అని అతను వెల్లడించాడు.కొన్నాళ్ల క్రితమే రోహిత్‌ నాయకత్వంలో భారత్‌ టి20 టోర్నీ నిదాహస్‌ ట్రోఫీ కూడా గెలుచుకుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top