ఏషియాడ్‌ స్వర్ణం... ఒలింపిక్స్‌ టికెట్‌

Indian hockey team in the defending championship - Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌గా  బరిలో భారత హాకీ జట్టు

వరుసగా రెండోసారి టైటిల్‌పై ఆశలు

హాకీ... ఒక తరంలో భారత కీర్తి పతాక. మన జట్టు పేరు చెబితే చాలు... బరిలో దిగకముందే ప్రత్యర్థులు బేజారెత్తిపోయేవారు. తర్వాతర్వాత పరిస్థితులు మారాయి. మిగతా దేశాలు పుంజుకోవడంతో పాటు, టీమిండియా వెనుకబాటుతో అంతరం పెరిగిపోయింది. ప్రధాన టోర్నీల్లో ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఆసియా క్రీడల్లో తళుక్కున మెరిసింది టీమిండియా. ఉత్కంఠను తట్టుకుని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి స్వర్ణం ఒడిసిపట్టింది. అటు నుంచి అటే ఒలింపిక్స్‌ బెర్త్‌ కూడా కొట్టేసింది. అలాంటి అవకాశమే మళ్లీ వచ్చింది. మరి... డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగిడుతోన్న శ్రీజేష్‌ సేన నాటి ప్రదర్శనను పునరా వృతం చేస్తుందా...? మరోసారి నేరుగా ఒలింపిక్స్‌ టికెట్‌ సంపాదిస్తుందా...?

సాక్షి క్రీడా విభాగం :పదహారేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గింది భారత హాకీ జట్టు. అది కూడా పెనాల్టీ షూటౌట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి...! మరపురాని ఈ విజయం అనంతరం టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. కొంతకాలంగా ఆటతీరులో పురోగతి కనిపిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా ఎదుర్కొనగలమని చాటుతోంది. ఇటీవలి చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌కు చేరడమే దీనికి నిదర్శనం. కోచ్‌గా భారత్‌కే చెందిన హరేంద్ర సింగ్‌ నియామకంతో ఆటగాళ్లకు భాష సమస్య తీరి సమన్వయం కుదురుతోంది. దీంతోపాటు కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో ఏషియాడ్‌లో రాణింపుపై అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడ ‘టాప్‌’లో నిలిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయమైపోతుంది. మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఈ రెండేళ్ల సమయాన్ని సన్నాహాలపై వెచ్చించే సౌలభ్యం కలుగుతుంది. 

సమతూకంతో... 
డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌ పునరాగమనం, మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌ నిలకడ, యువ ఆటగాళ్లు మన్‌ప్రీత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌... గోల్‌పోస్ట్‌ వద్ద గోడ కట్టే కీపర్, కెప్టెన్‌ శ్రీజేష్‌లతో భారత హాకీ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇద్దరు, ముగ్గురు మినహా... మిగతా ఆటగాళ్లకు వంద మ్యాచ్‌ల అనుభవం ఉండటం విశేషం. దీనిని దృష్టిలో ఉంచుకునే కెప్టెన్‌ శ్రీజేష్‌... తమది సమతూకమైన జట్టని, ఏషియాడ్‌లో ఫేవరెట్లమని పేర్కొన్నాడు. అయితే, గోల్‌ అవకాశాలను ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనే దానిపైనే టీమిండియా టైటిల్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ముందుగా స్కోరు చేసి ప్రత్యర్థిపై పైచేయి సాధించడంతో పాటు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలచడమూ కీలకమే. పెనాల్టీల విషయంలో జట్టు మెరుగు పడాలని అందరూ సూచిస్తున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ, కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రూపిందర్‌పాల్‌ సింగ్‌ రాకతో ఈ ఆందోళన తీరినట్లే అనిపిస్తోంది. మరోవైపు కీలక సమయంలో ఆధిక్యాన్ని చేజార్చుకునే బలహీనతను అధిగమించాల్సి ఉంది.  

నాలుగో స్వర్ణం వేటలో... 
ఏషియాడ్‌ హాకీలో భారత్‌ మొత్తం 14 పతకాలు సాధించింది. 1966, 1988, 2014లో స్వర్ణాలు కైవసం చేసుకుంది. 9 సార్లు రన్నరప్‌గా నిలవడం విశేషం. రెండుసార్లు కాంస్యంతో సంతృప్తి పడింది. పురుషుల హాకీని 1958 ఏషియాడ్‌ నుంచి ప్రవేశపెట్టగా భారత్‌ ఒక్కసారి (2006) మాత్రమే ఏ పతకమూ సాధించకుండా వెనుదిరిగింది. ఈసారి బంగారు పతకం నెగ్గితే... దక్షిణ కొరియాతో సమానంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డులకెక్కుతుంది.
 
మహిళలకూ మహదవకాశమే... 
ఇటీవల ప్రపంచకప్‌లో భారత మహిళల హాకీ జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. కఠిన పరిస్థితులకు నిలిచి క్వార్టర్స్‌ వరకు వచ్చింది. అదే ఊపు కొనసాగిస్తే ఏషియాడ్‌లోనూ మంచి ఫలి తాలు ఆశించవచ్చు. ఇక స్వర్ణం సాధిస్తే... నేరుగా ఒలింపిక్స్‌ టికెట్‌ దక్కినట్లే. అదే జరిగితే అద్భుతం సృష్టించిన జట్టవుతుంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడాక భారత మహిళల జట్టు తడబడింది. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2016లో రియో ఒలింపిక్స్‌కు మరోసారి అర్హత పొందింది. ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకోవాలని రాణి రాంపాల్‌ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది.

టాప్‌–4లో
1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీని తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత మహిళల జట్టు కనీసం టాప్‌–4లో నిలుస్తోంది. 1982లో స్వర్ణం నెగ్గిన భారత మహిళల జట్టు... ఆ తర్వాత రజతం (1998), మూడుసార్లు కాంస్యం (1986, 2006, 2014) సాధించింది. 1990, 1994, 2002, 2010లలో నాలుగో స్థానంలో నిలిచింది.

చాంపియన్స్‌ ట్రోఫీని కొద్దిలో చేజార్చుకున్నాం. ఇప్పుడు మా లక్ష్యం ఏషియాడ్‌ స్వర్ణం నెగ్గి తద్వారా ఒలింపిక్స్‌ బెర్తు కొట్టేయడమే. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం మేం దానిని సాధించగలం.
– శ్రీజేష్, భారత కెప్టెన్‌ 

వరుసగా రెండుసార్లు ఏషియాడ్‌ స్వర్ణం నెగ్గిన హాకీ జట్టుగా రికార్డులకెక్కే అర్హత, టైటిల్‌ నిలబెట్టుకునే సత్తా పటిష్ఠమైన ఈ జట్టుకుంది. ఇక్కడ స్వర్ణం సాధిస్తే... ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న ప్రపంచ కప్‌నకు సరైన స్ఫూర్తిగా నిలుస్తుంది.
– హరేంద్ర సింగ్, కోచ్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top