
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ మరింత ప్రగతి సాధిస్తుందని అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చెప్పాడు. ఈ కఠోర శ్రమ ఇక ముందూ కొనసాగితే ఘన విజయాలకు కొదవే ఉండదన్నాడు. గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ మీడియాతో మాట్లాడుతూ ‘భారత బ్యాడ్మింటన్ ముందుకు సాగుతోంది. గత మూణ్నాలుగేళ్లుగా మేం చాలా కష్టపడ్డాం. అదిప్పుడు పతకాలు, ట్రోఫీల రూపంలో కనబడుతోంది. దీనికంతటికీ గోపీ సారే (కోచ్ గోపీచంద్) కారణం. నిజంగా ఆయన లేని నా విజయాల్ని ఊహించలేను. నా సామర్థ్యంపై నా కంటే ఆయనకే నమ్మకమెక్కువ. ఈ విషయంలో ఆయనకెప్పుడు రుణపడివుంటా’నని అన్నాడు. హెచ్.ఎస్. ప్రణయ్‌లాంటి సహచరులతో గట్టి పోటీ ఎదురవడం తమ ప్రదర్శనకు మంచిదేనన్నాడు. ఇది ఆటతీరును మరింత మెరుగుపరుస్తుందని శ్రీకాంత్ చెప్పాడు. గోపీచంద్ మాట్లాడుతూ శ్రీకాంత్, ప్రణయ్‌లు కోర్టులో ప్రత్యర్థులు, కోర్టు బయట మంచి స్నేహితులని కితాబిచ్చారు.
ఐటీఎమ్ గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా...
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో దూసుకెళ్తున్న శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్‌లతో ఐటీఎమ్ విద్యాసంస్థల గ్రూప్ ఒప్పందం చేసుకుంది. వీళ్లిద్దరు మూడేళ్ల పాటు ఐటీఎమ్ గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లతో జత కట్టడం తమకు గర్వకారణమని ఈ సందర్భంగా ఐటీఎమ్ చైర్మన్ డాక్టర్ పీవీ రమణ అన్నారు.