కివీస్‌ గడ్డపై తొలి వన్డే మనదే!

India Won By 8 Wickets Against New Zealand - Sakshi

రాణించిన భారత బౌలర్లు

హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న ధావన్‌

5 వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన భారత్‌

నేపియర్‌ : ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా న్యూజిలాండ్‌ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కోహ్లిసేన అదరగొట్టింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో సమిష్టిగా రాణించి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో కుల్దీప్‌(4/39), మహ్మద్‌ షమీ(3/19)లు చెలరేగగా.. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ (75 నాటౌట్‌:103 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (45:59 బంతుల్లో 3 ఫోర్లు), అంబటి రాయుడు (13 నాటౌట్‌)లు రాణించారు. ఈ గెలుపుతో కోహ్లిసేన.. కివీస్‌ పర్యటనను ఘనంగా ఆరంభించింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (64) మినహా మిగితా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవ్వడంతో కివీస్‌ 38 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ నాలుగు, షమీ మూడు వికెట్లు తీయగా.. చహల్‌ రెండు, జాదవ్‌ ఒక వికెట్‌ తీశారు. 

ధనాధన్‌ ధావన్‌..
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నమోదైన అనంతరం రోహిత్‌(11) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లితో ధావన్‌ దాటిగా ఆడాడు. అయితే తీవ్ర ఎండ కారణంగా మ్యాచ్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. దీంతో అంపైర్లు భారత లక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులకు కుదించారు. మ్యాచ్‌ పునఃప్రారంభం అనంతరం ధావన్‌ తనదైన రీతిలో చెలరేగాడు. ఈ క్రమంలో 69 బంతుల్లో కెరీర్‌లో 26వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీకి చేరువగా వచ్చి ఫోర్గసన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడితో ధావన్‌ మిగతా పనిని పూర్తి చేశాడు. దీంతో భారత్‌ 85 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top