బాక్సింగ్‌ డే టెస్ట్‌ భారత్‌దే!

India Won By 137 Runs in Third Test Win Over Australia - Sakshi

చరిత్ర సృష్టించిన కోహ్లిసేన

టెస్ట్‌ల్లో 150వ విజయం నమోదు చేసిన భారత్‌

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం

విజయంతో ఈ ఏడాది ఘనంగా ముగించిన కోహ్లి సేన

బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్‌ డే టెస్ట్‌లో తొలి విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 399 పరుగుల భారీలక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు భారత్‌ బౌలర్ల దాటికి కుదేలైంది. ఏకంగా 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ గెలుపుతో భారత్‌ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. ప్యాట్‌ కమిన్స్‌ అద్భుత అర్ధ సెంచరీతో విజయం కోసం భారత్‌ చివరి రోజు వరకు నిరీక్షించాల్సి వచ్చింది.  258/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. మరో మూడు పరుగుల్లోనే చివరి రెండు వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యమైనప్పటికీ విజయం వరించడానికి మాత్రం ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్‌(63; 114 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్‌)ను బుమ్రా ఔట్‌ చేయగా.. నాథన్‌ లయన్‌(7; 50 బంతులు) ను ఇషాంత్‌ శర్మ పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో బాక్సింగ్‌ డే టెస్ట్‌ భారత్‌ వశమైంది. ఇక ఇది టెస్ట్‌ల్లో భారత్‌కు 150వ విజయం కావడం విశేషం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో జట్టుగా భారత్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన బూమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది

బాక్సింగ్‌ డే టెస్ట్‌లో తొలి విజయం..
ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 8 బాక్సింగ్‌ డే టెస్ట్‌లు ఆడిన భారత్‌.. తొలి సారి విజయం సాధించింది. ఐదు సార్లు ఆసీస్‌ విజయం సాధించగా.. రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిసాయి. ఇక ఆసీస్‌ పర్యటనలో భారత్‌ సిరీస్‌ కోల్పోకుండా ఉండటం భారత్‌కు ఇది నాలుగోసారి. 1980-81, 1958-86, 2000-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌లను డ్రా చేసుకోంది. చివరి టెస్ట్‌ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్‌ కాపాడుకుంటే సిరీస్‌ భారత్‌ వశం కానుంది. తద్వారా ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ గెలవాలనే కోహ్లిసేన లక్ష్యం నెరవేరతుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 443/7 డిక్లేర్డ్‌, రెండో ఇన్నింగ్స్‌ 106/8 డిక్లేర్డ్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 151 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 261 ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top