ఆశలు గల్లంతు! | India Lose The Football Match Against Oman | Sakshi
Sakshi News home page

ఆశలు గల్లంతు!

Nov 20 2019 4:45 AM | Updated on Nov 20 2019 4:45 AM

India Lose The Football Match Against Oman - Sakshi

మస్కట్‌: భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రపంచ కప్‌ ఆశలకు దాదాపుగా తెరపడింది. 2022 ప్రపంచకప్‌ ఆసియా జోన్‌ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో భారత్‌ 0–1తో ఒమన్‌ చేతిలో కంగుతింది. దీంతో రెండో రౌండ్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌ తన ప్రపంచకప్‌ పోరాటాన్ని దాదాపు ముగించేసింది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన ఒమన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పదే పదే భారత ‘డి’ బాక్స్‌లోకి చొచ్చుకువచ్చి ఒత్తిడి పెంచింది. ఆట 33వ నిమిషంలో ఒమన్‌ ఆటగాడు మోసిన్‌ అల్‌ ఖాల్ది అద్భుతమైన పాస్‌ను గోల్‌గా మలిచిన ముసెన్‌ అల్‌ ఘసాని తన జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. మ్యాచ్‌లో గోల్‌ కోసం భారత్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో భారత ఓటమి ఖాయమైంది.

ఒకవేళ భారత్‌ అర్హత పోటీల్లో ముందంజ వేయాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ గోల్స్‌తో గెలవాలి. ఆ తర్వాత ఇతర గ్రూప్‌ల సమీకరణాలపై ఆధారపడాలి. ఆసియా జోన్‌ రెండో రౌండ్‌లో ఎనిమిది గ్రూప్‌ల్లో (ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి) అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు నేరుగా మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. రెండో రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచిన మిగతా నాలుగు అత్యుత్తమ జట్లకు కూడా మూడో రౌండ్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఐదు జట్లున్న గ్రూప్‌ ‘ఇ’లో ప్రస్తుతం ఖతర్‌ (13 పాయింట్లు), ఒమన్‌ (12 పాయింట్లు), అఫ్గానిస్తాన్‌ (4 పాయింట్లు), భారత్‌ (3 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ మిగిలిన తమ మూడు మ్యాచ్‌లను వచ్చే ఏడాది మార్చి 26న ఖతర్‌తో; జూన్‌ 4న బంగ్లాదేశ్‌తో; జూన్‌ 9న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement