ఎక్కడైనా...ఎప్పుడైనా...

India Cricket Team Fit To Play T20 Against Bangladesh - Sakshi

భారత్‌దే ఆధిపత్యం

షకీబ్, ఇతర సమస్యలతో బంగ్లా

పటిష్టంగా టీమిండియా

భారత్‌ ముందు బంగ్లా బేబీనే! మూడు ఫార్మాట్లలోనూ టీమిండియానే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వన్డేల్లో అప్పుడొకటి... ఇప్పుడొకటి అన్నట్లు వేళ్లమీద లెక్కపెట్టే విజయాలు సాధించిందేమో కానీ... టెస్టులు, టి20ల్లో అయితే టీమిండియాకు ఎదురేలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా ప్రతీ విభాగంలోనూ ప్రత్యర్థి కంటే భారతే బలంగా ఉండటంతో పొట్టి ఫార్మాట్‌లో ఎక్కడైనా... ఎప్పుడైనా... ఇంటాబయటా బంగ్లాపై టీమిండియానే గెలుస్తూ వచ్చింది.

సాక్షి క్రీడావిభాగం: క్రికెట్‌ ప్రపంచంలో ఏ రకంగా చూసినా బంగ్లాదేశ్‌ కంటే భారతే మెరుగైన జట్టు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్, అనుభవజ్ఞులైన పేస్‌ దళం, నాణ్యమైన స్పిన్నర్లు ఇలా తుది 11 మందిదాకా భారత్‌ ప్రత్యర్థి కంటే ఎంతో దుర్బేధ్యమైంది. ప్రస్తుత జట్టులో విశ్రాంతి వల్ల రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడే అందుబాటులో లేడు. కానీ అతడి వెన్నంటే నిలిచిన యావత్‌ జట్టంతా అస్త్రశస్త్రాలతో రెడీగా ఉంది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా సమరానికి సై అంటోంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ విజయవంతమైన కెప్టెన్‌గా ‘హిట్‌మ్యాన్‌’ ఘనతకెక్కాడు. పైగా ఇప్పుడు జరగబోయేది టి20 పోరే కాబట్టి అతని సారథ్య బాధ్యతలకు, ఓపెనింగ్‌కు ఇది తెలిసొచ్చిన పనే తప్ప అదనపు భారం కానేకాదు.

సమస్యల్లో బంగ్లా... 
మేటి జట్టు భారత్‌తో సిరీస్‌కు సమాయత్తం అవుతుండగానే బంగ్లా క్రికెట్‌లో ముసలం రేగింది. పర్యటనకు కొన్ని రోజుల వ్యవధే ఉండగా ఆటగాళ్లంతా ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. తమ కాంట్రాక్టు ఫీజులు పెంచకపోతే ఏ రకమైన క్రికెట్‌ అడేది లేదని బోర్డు (బీసీబీ)తో తెగేసి చెప్పారు. చివరకు  ఒప్పించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుండగా... మేటి ఆల్‌రౌండర్, కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వేటు వేసింది. బుకీలు అతన్ని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చెప్పలేదని రెండేళ్ల నిషేధం విధించింది. ఎంతో అనుభవజ్ఞుడైన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కీలకమైన సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. షకీబ్‌ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అసాధారణంగా రాణించాడు. అలాంటి ఆటగాడు లేని జట్టు భారత్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

సమరోత్సాహంతో రోహిత్‌ సేన...
సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో టి20 మెరుపులు మెరిపించేందుకు రోహిత్‌ సేన సిద్ధంగా ఉంది. అనుభవజ్ఞులైన రోహిత్‌–శిఖర్‌ ఓపెనింగ్‌ జోడీకి సత్తాగల కుర్రాళ్లు శ్రేయస్, మనీశ్, రిషభ్, సంజూ సామ్సన్, కృనాల్‌ పాండ్యాలు జతయ్యారు. వీళ్లంతా తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సీనియర్‌ సీమర్లు లేకపోయినా శార్దుల్, దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్‌లు అందివచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. తిప్పేసేందుకు మణికట్టు స్పిన్నర్‌ చహల్‌ ఉన్నాడు. దీంతో భారత్‌ పేస్, స్పిన్‌ అటాక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలదు. 

ఆడినవన్నీ భారతే గెలిచింది... 
ఇరు జట్ల మధ్య ఈ పదేళ్లలో 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌ మొదలు ఆసియా కప్, గతేడాది నిదహాస్‌ ట్రోఫీ దాకా బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా ఏ దేశమైనా ... ఎప్పుడైనా భారత్‌దే విజయం. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలిచింది. దీంతో ఈ ఫార్మాట్‌లో భారత్‌ ప్రత్యర్థిపై ఎదురులేని రికార్డును కలిగి ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top