రప్ఫాడించిన ధోని సేన

రప్ఫాడించిన ధోని సేన


మిర్పూర్:ధనాధన్ క్రికెట్‌లో తమదైన ముద్ర చూపిస్తూ చెలరేగిపోతున్న టీమిండియా మరోసారి అదుర్స్ అనిపించింది.  తొలుత బౌలింగ్తో యూఏఈను బెదరగొట్టి.. అటు తరువాత బ్యాటింగ్లో అదరగొట్టింది. తద్వారా ఆసియాకప్లో తమ చివరి లీగ్ మ్యాచ్‌ ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల విజయాన్ని సాధించింది.





యూఏఈ విసిరిన 82 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(39; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తనదైన మార్కును చూపిస్తూ దూకుడుగా ఆడాడు.  కాగా, జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్(16 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు), యువరాజ్ సింగ్(25; 14 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్))లు మరో వికెట్ పడకుండా 39 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా 10.1 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది.





అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆది నుంచి బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడింది. పటిష్టమైన భారత బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొలేక స్వల్ప స్కోరుకే పరిమితమైంది. యూఏఈ ఆటగాళ్లలో సైమాన్ అన్వర్(43) మినహా ఎవరూ రాణించలేదు. అన్వర్ తరువాత రోహన్ ముస్తఫా(11)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం.  దీంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో  తొమ్మిది వికెట్ల నష్టానికి 81 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్కు రెండు వికెట్లు లభించగా, బూమ్రా, పాండ్యా, హర్భజన్ సింగ్, నేగీ, యువరాజ్లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.





మ్యాచ్ విశేషాలు..







*యువరాజ్ సింగ్ కు ఇది 50వ ట్వంటీ 20 మ్యాచ్. అంతకుముందు భారత్ తరపున ధోని, రైనా, రోహిత్ శర్మలు ఈ ఘనతను అందుకున్నారు.



* పవర్ ప్లేలో యూఏఈ 21 పరుగులు మాత్రమే చేయడంతో జింబాబ్వే సరసన చేరింది. 2010లో జింబాబ్వే పవర్ ప్లేలో 21 పరుగులనే నమోదు చేసింది.



*ట్వంటీ 20ల్లో తొలి పరుగును సాధించడానికి యూఏఈకు అవసరమైన బంతులు 11. అంతకుముందు 2010 లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే మొదటి పరుగును చేయడానికి 21 బంతులను ఆడటం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top