ఆరుగురు బౌలర్ల వ్యూహం.. శాంసన్‌, పంత్‌ డౌటే? 

IND VS NZ  1st T20: Virat Kohli Is Set To Take Some Tough Calls - Sakshi

ఆక్లాండ్‌: కొత్త ఏడాదిలో తొలి విదేశీ పర్యటనను విజయంతో ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది. సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో  కోహ్లిసేన ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. శుక్రవారం జరిగే తొలి టీ20తో న్యూజిలాండ్‌ పర్యటనను టీమిండియాను ఆరంభించనుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ అనంతరం కోహ్లి సేన వరుసగా వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన సిరీస్‌లను కైవసం చేసుకుంది. కొత్త ఏడాదిలో తొలి విదేశీ పర్యటనతో పాటు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ టీ20 సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఆక్లాండ్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌ గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా జట్టు కూర్పులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అతడిపై క్లారిటీ కోసమే..
రేపటి మ్యాచ్‌కు కేరళ కుర్రాడు, వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ ఆడేది అనుమానంగానే మారింది. అంతేకాకుండా రిషభ్‌ పంత్‌ కూడా తుదిజట్టులో ఆడకపోవచ్చు. ఎందుకంటే కేఎల్‌ రాహుల్‌ కీపర్‌గా సక్సెస్‌ అవడం, మరో బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండేపై స్పష్టత వచ్చేందుకు స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ను జట్టులోకి తీసుకోవడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపడంలేదు. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో మిడిలార్డర్‌ను పరీక్షించే ఉద్దేశంతో మనీశ్‌ పాండేకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తోంది. దీంతో శాంసన్‌తో పాటు పంత్‌ కూడా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక గాయం కారణంగా ధావన్‌ దూరమవడంతో రోహిత్‌తో రాహుల్‌ ఓపెనింగ్‌కు వస్తాడు. విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌లు ఫామ్‌లో ఉండటం, మనీశ్‌ పాండే నమ్మదగ్గ బ్యాట్స్‌మన్‌ కావడంతో బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా భరోసాతో ఉంది. 

ఆరుగురు బౌలర్ల వ్యూహం?
రోహిత్‌, రాహుల్‌, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండేలతో బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉండటంతో కివీస్‌తో జరిగే తొలి టీ20లో ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ను తీసుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. పేస్‌ విభాగంలో జస్ప్రిత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీలు జట్టులో ఉండటం పక్కా అని తెలుస్తోంది. ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌లు జట్టులో ఉండే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, సుందర్‌లు బ్యాటింగ్‌ కూడా చేయగల సమర్థులు కావడంతో ఆరుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇక మ్యాచ్‌ సమయానికి ప్రత్యర్థి జట్టుకు, క్రీడా పండితుల ఊహకందని మార్పులు తుదిజట్టు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

చదవండి: 
‘అక్తర్‌.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

‘ఇప్పుడే ఐపీఎల్‌లో ఆడటం అవసరమా?’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top