‘అక్తర్‌.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’

Akhtar Takes Nasty Dig At Sehwag fans Fire - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ క్రికెట్‌, క్రికెటేతర విషయాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తన యూట్యూబ్‌ ఛానళ్లో ఆసక్తికర, సంచలన, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండే అక్తర్‌కు ఎందుకో మూడేళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. దీంతో వెంటనే ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రూపొందించి తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే అనేదంతా అనేసి చివర్లో  ‘వీరూ భాయ్‌ సరదాగా అన్నాను..  నా వ్యా​ఖ్యలను నువ్వు కూడా సరదాగా తీసుకో’అని అక్తర్‌ పేర్కొనడం కొసమెరుపు. ఇక అక్తర్‌ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్తర్‌ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సెహ్వాగ్‌ ప్యాన్స్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. 

ఇంతకీ అసలేం జరిగిందంటే.. భారత్‌, భారత క్రికెట్‌ గురించి మాట్లాడకుంటే పాకిస్తాన్‌ క్రికెటర్లకు వ్యాపారం సాగదు కదా అని సెహ్వాగ్‌ అప్పుడెప్పుడో వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అక్తర్‌ మూడేళ్ల తర్వాత రియాక్ట్‌ అయ్యాడు. ‘నా స్నేహితుడు సెహ్వాగ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతున్నాయి. డబ్బు, వ్యాపారం కోసమే అక్తర్‌ భారత క్రికెట్‌ గురించి మాట్లాడతాడంటూ ఆ వ్యాఖ్యల్లో ఉంది. అయితే వీరూ భాయ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నారు. డబ్బు అనేది నాకు భారత్‌ ఇచ్చింది కాదు. ఆ భగవంతుడు ఇచ్చాడు. నీ(సెహ్వాగ్‌) తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ డబ్బే నా దగ్గర ఉంది. 

పదిహేనేళ్లు పాకిస్తాన్‌ తరుపున సుదీర్ఘ క్రికెట్‌ ఆడటంతో నాకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సరిపడేంత డబ్బు సంపాదించుకున్నాను. ఇంకా డబ్బు కోసం ఎందుకు వెంపర్లాడుతాను. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిన తర్వాత నా అభిప్రాయాలు చెప్పాను. ఇక టీమిండియా సిరీస్‌ గెలిచాక మెచ్చుకున్నాను. కోహ్లి సేన ఓడిపోయినప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా గతంలో ఎప్పుడో సెహ్వాగ్‌ అన్న మాటలను తాజాగా ఇప్పుడు హైలెట్‌ చేస్తున్నారు. అందుకే నేను చెప్పాల్సింది చెప్పాను. అయితే సెహ్వాగ్‌పై నాకు ఎలాంటి కోపం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. సెహ్వాగ్‌ చాలా సరదా వ్యక్తి. సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే ఆ వ్యాఖ్యలు కూడా సరదాగానే అని ఉంటాడని భావిస్తున్నా’అని అక్తర్‌ పేర్కొన్నాడు. అయితే చివర్లో తన వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని సీరియస్‌గా తీసుకోవద్దని సెహ్వాగ్‌తో పాటు భారత ఫ్యాన్స్‌కు అక్తర్‌ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  

చదవండి: 
కోహ్లి అప్పుడా వచ్చేది?

‘4 దగ్గర లైఫ్‌ ఇచ్చారు.. 264 కొట్టాడు’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top