మనకు ఆనందం.. వారికి బాధ

On This Day Rohit Sharma Broke Virender Sehwags Record - Sakshi

భారత క్రికెట్‌కు దూకుడు మంత్రం నేర్పింది వీరేంద్ర సెహ్వాగ్‌.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెహ్వాగ్‌ తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అప్పుడే వచ్చాడు మట్టిలో మాణిక్యం అనుకోవాలో.. సముద్రంలో సునామీ అనుకోవాలో.. బౌలర్ల్‌ హిట్‌ లిస్ట్‌లో ఉండే ఆ హిట్‌ మ్యాన్‌ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా. టీమిండియా ఓపెనర్‌, సిక్సర్ల కింగ్‌, సెహ్వాగ్‌ స్క్వేర్‌, అభిమానులు ముద్దుగా పిలిచే హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటికే చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. (చదవండి: ప్రతీ క్షణం అతడి గురించే చర్చ)

వన్డే క్రికెట్‌లో అసాధ్యమనుకునే డబుల్‌ సెంచరీని అవలీలగా మూడు సార్లు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు రోహిత్‌ శర్మ. తొలి డబుల్‌ సెంచరీ సాధించనప్పుడు ఏదో గాలి వాటమనుకున్నారు.. రెండో ద్విశతకం సాధించనప్పుడు ప్రత్యర్థి జట్టుకే కాదు.. భారత ఫ్యాన్స్‌కు నిద్రలోనూ రోహిత్‌ బ్యాటింగే గుర్తొచ్చేదంటే అతిశయోక్తి కాదు. బౌండరీ నలువైపులా చూడముచ్చటైన షాట్లు.. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు.. రోహిత్‌ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో దిక్కుతోచక పసిపిల్లలయ్యారు. ఈ అపూర్వ ఘట్టం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో చోటుచేసుకుంది. రోహిత్‌ విశ్వరూపం ప్రదర్శించి 264 పరుగులు చేసిన ఆ మ్యాచ్‌ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయింది.

ఈ సందర్భంగా రోహిత్‌ సాధించిన ఘనతను గుర్తుచేస్తూ ఐసీసీ, బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆ మ్యాచ్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు చేసి వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. ఇక ట్రిపుల్‌ సెంచరీ సాధించినా ఆశ్చ​ర్యపోవాల్సిన అవసరంలేదు అనే రీతిలో రోహిత్‌ బ్యాటింగ్‌ సాగింది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్‌ నాలుగు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను లంక ఆల్‌రౌండర్‌ తిశార పెరీరా నేలపాలు చేశాడు. దీంతో లంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ముఖ్యంగా ఆ క్యాచ్‌ వదిలేసినందుకు పెరీరా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. ఇక రోహిత్‌ సునామీ ఇన్నింగ్స్‌కు టీమిండియా నాలుగు వందలకుపైగా స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. 

అంతకుముందు.. ఆ తర్వాత
రోహిత్‌ శర్మ తొలి డబుల్‌ సెంచరీ ఆస్ట్రేలియాపై సాధించాడు. 2013లో నవంబర్‌ 2న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఖాయమైంది. ఇక ఆ తర్వాత ఏడాది శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. అనంతరం 2017లో లంకపై మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ట్రిపుల్‌ డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 

రోహిత్‌తో పాటు ఇంకెవరు?
వన్డే క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చరిత్రలో నిలిచిపోయాడు. 2010లో దక్షిణాఫ్రికాపై ఆ ఘనత సాధించి వన్డేల్లోనూ ద్విశతకం సాధించవచ్చని సచిన్‌ ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపించాడు. ఇక సచిన్‌ శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్‌ గురువు దారిలోనే పయనించాడు.  2011లో ఇండోర్‌ స్టేడియంలో వెస్టిండీస్‌పై 219 పరుగులు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడు. న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్టిల్‌ వెస్టిండీస్‌పై(237 నాటౌట్‌), యూనివర్సల్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ జింబాబ్వే(215)పై ద్విశతకాలు నమోదు చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు రెండు అంతకంటే ఎక్కువ డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌ రోహిత్‌ శర్మ.  (చదవండి: మనసులో మాట బయటపెట్టిన రోహిత్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top