‘ఈడెన్‌లో గంట ఎందుకు కొట్టానో తెలీదు’

Ind Vs Ban:Carlsen Shares Experience Of Ringing Ceremonial Bell - Sakshi

కోల్‌కతా:  గత కొంతకాలంగా నగరంలోని ఈడెన్‌ గార్డెన్‌లో గంట కొట్టిన తర్వాత మ్యాచ్‌ను ఆరంభించడం జరుగుతుంది. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌ బాల్‌  టెస్టు తొలి రోజు  బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్‌ గార్డెన్స్‌లో గంటను మోగించి మ్యాచ్‌ ప్రారంభానికి తెరతీశారు. కాగా, రెండో రోజు ఆటలో ఈడెన్‌లో బెల్‌ను చెస్‌ దిగ్గజాలు విశ్వనాథన్‌ ఆనంద్‌తో కలిసి మాగ్నస్‌ కార్ల్‌సన్‌(నార్వే) మోగించాడు. అయితే తాను బెల్‌ ఎందుకు కొట్టానో తెలీదు అంటున్నాడు కార్లసన్‌.

వరల్డ్‌ చాంపియన్‌ అయిన కార్ల్‌సన్‌ మాట్లాడుతూ.. తాను ఒక తెలివి తక్కువ వాడిలా ఆనంద్‌ పక్కన నిలబడి మాత్రమే గంటను కొట్టాననన్నాడు. తనకు క్రికెట్‌ గురించి పెద్దగా తెలియదని ఈ సందర్భంగా కార్ల్‌సన్‌ తెలిపాడు. టాటా స్టీల్‌ ర్యాపిడ్‌-బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భాగంగా నగరంలో ఉన్న కార్ల్‌సన్‌.. ఆనంద్‌తో కలిసి గంటను కొట్టేందుకు బీసీసీఐ ఆహ్వానించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ వచ్చి రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు గంటను మోగించారు. ‘  ఆనంద్‌ గంట కొట్టేటప్పుడు తెలివి తక్కువ వాడిలా పక్కన నిలబడ్డాను. అదే జరిగింది. నాకు క్రికెట్‌ గురించి పెద్దగా తెలీదు. నేను క్రికెట్‌ గురించి ఇంకా నేర్చుకోవాలి. అసలు మ్యాచ్‌ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా. మ్యాచ్‌ అయిపోయిందా.. ఇంకా జరుగుతుందా అని అడిగా. మ్యాచ్‌ అయిపోయిందనే సమాధానం వచ్చింది. ఇక ప్రత్యర్థి జట్టుకు చాన్స్‌ లేదని ఆనంద్‌ చెప్పాడు’ అని కార్ల్‌సన్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top