
జొహన్నెస్‌బర్గ్: వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికే క్రికెటర్ల జాబితాలో మరో పేరు చేరింది. ఇప్పటికే వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతానని ప్రకటించగా... తాజాగా దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా రిటైర్మెంట్ బాటలో నడవనున్నాడు. ఈనెల 27వ తేదీన 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తాహిర్ ఇప్పటికి 95 వన్డేలు ఆడి 156 వికెట్లు పడగొట్టాడు.
వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను టి20 ఫార్మాట్‌లో కొనసాగుతానని తెలిపాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 వన్డే వరల్డ్ కప్‌లలో... 2014, 2016 టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాహిర్ 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా తాహిర్ (58 వన్డేల్లో) ఘనత వహించాడు.