ఈసారి కూడా చాంపియన్‌ ఆస్ట్రేలియానే

ICC Womens T20 World Cup 2020 Champion Australia - Sakshi

ఫైనల్‌ పోరులో తడబడిన టీమిండియా

85 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం

ఐదో సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆసీస్‌

మెల్‌బోర్న్‌: చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (61 నాటౌట్‌; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్‌(0), హర్మన్‌(4) ఘోరంగా నిరుత్సాహపరిచారు. చివర్లో దీప్తి శర్మ(33) రాణించడంతో టీమిండియా కనీసం గౌరవప్రదమైన స్కోర్‌నైనా సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ షూట్‌ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్‌ మూడు వికెట్లు పడగొట్టింది. 

పోరాటం లేదు.. ఒత్తిడితో చిత్తు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా గెలుపు వైపు పోరాటం సాగించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో హర్మన్‌ సేన ఒత్తిడిని కొన్ని తెచ్చుకున్నట్టయింది. దీంతో కనీస ప్రదర్శనను కూడా బ్యాటర్లు ఇవ్వలేకపోయారు. షఫాలీ వర్మ నుంచి ఆరంభమైన వికెట్ల పతనం ఓటమి వరకు సాగుతూ వెళ్లింది. ఆసీస్‌ బ్యాటర్స్‌ రెచ్చిపో​యిన చోట.. మనోళ్లు తేలిపోయారు. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా కడవరకు క్రీజులో నిలువలేకపోయారు. అనుభవమున్న హర్మన్‌, మంధాన, వేద కృష్ణమూర్తిలు సైతం ప్రత్యర్థికి దాసోహమయ్యారు. వీరిలో ఏ ఒక్కరు క్రీజులో ఉన్నా యువ ప్లేయర్స్‌ ధైర్యంగా ఆడేవారు. 

ఆసీస్‌ చాంపియన్‌ ఆట..
ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా చాంపియన్‌ ఆటను ప్రదర్శించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియాపై అన్ని విభాగాల్లో పై చేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆసీస్‌ ప్లేయర్స్‌.. ఆ తర్వాత బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరిసిపోయారు. గెలిచే వరకు ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించలేదు. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలవడానికి అన్ని విధాల అర్హమైనదిగా నిలిచింది. దీంతో ఐదో సారి టీ20 ఫార్మట్‌లో జగజ్జేతగా నిలిచింది. మరోవైపు తొలి సారి ఫైనల్‌కు చేరిన టీమిండియాకు తీవ్రమైన నిరాశ తప్పలేదు. 

చదవండి:
థ్యాంక్యూ వసీం జాఫర్‌..
హార్దిక్‌ నామస్మరణతో మార్మోగిన స్టేడియం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top