
పరిస్థితుల్లో మార్పు రావచ్చు:విరాట్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ లో అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) లేకపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త భిన్నంగా స్పందించాడు.
ఫతుల్లా(బంగ్లాదేశ్):బంగ్లాదేశ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ లో అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) లేకపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త భిన్నంగా స్పందించాడు. గతంలో తమ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) వ్యతిరేకించిన డీఆర్ఎస్ పద్ధతి నిర్ణయంలో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదన్నాడు. అయితే దీనిపై త్వరలో టీమ్ సభ్యులతో కలిసి చర్చిస్తామన్నాడు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్ ల ఈ నిర్ణయంపై ఏమి అనుకుంటున్నారో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
'నేను ఒక విషయంగా చెప్పగలను. డీఆర్ఎస్ నిర్ణయంపై టీమ్ సభ్యులం సమావేశం అవుతాం. గత సంవత్సరం మహేంద్ర సింగ్ ధోనీ కూడా డీఆర్ఎస్ నిర్ణయం అమలుపై సానుకూల ధోరణి వ్యక్తం చేశాడు. అయితే ఇందులో ఫీల్డ్ అంపైర్ల పాత్ర ఎంతవరకు ఉండాలి అనేది కూడా ప్రధానాంశం. ఆటగాళ్ల అప్పీళ్లతోనే డీఆర్ఎస్ కు వెళితే బాగుంటుందని అప్పట్లో ధోనీ అభిప్రాయంగా చెప్పాడు. దీనిపై టీమ్ సభ్యులు కూర్చుని ఒక నిర్ణయానికి రావాలి. డీఆర్ఎస్ పై బీసీసీఐ నిర్ణయంలో మార్పు రావచ్చు' అని కోహ్లీ తెలిపాడు.
ఇదిలా ఉండగా బంగ్లాతో జరిగిన ఏకైక టెస్ట్ డ్రా కావడంపై కోహ్లీ తనదైన శైలిలో జవాబిచ్చాడు.ఆ టెస్టు మ్యాచ్ టీమిండియా చేతుల్లో చాలా తక్కువ సమయం ఉందన్నాడు. వరుణడు అడ్డుకోవడంతో మ్యాచ్ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయని కోహ్లీ పేర్కొన్నాడు.