అది ఎలాగో నాకే అర్థం కావడం లేదు: హెట్‌మెయిర్‌

 I Don't Know From Where The Power Is Coming From, Hetmyer - Sakshi

చెన్నై: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ చెపాక్‌ స్టేడయంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ శతకంతో కదం తొక్కి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయి 139 పరుగులు చేశాడు. ఫలితంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. కాకపోతే తన ప్రదర్శనపై హెట్‌మెయిర్‌ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు ఇంతటి పవర్‌ హిట్టింగ్‌ చేసే శక్తి ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదన్నాడు.

‘నాకు ఆ శక్తి ఎలా వచ్చిందో తెలియదు. కాకపోతే నేను హిట్‌ చేయగలననే విషయం తెలుసు. ఈ శతకం నాకు చాలా విలువైనది. చాలాకాలం తర్వాత సెంచరీ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో శతకం చేయగా, మళ్లీ చివర్లో సెంచరీ చేశా. కాకపోతే మనం సెంచరీ చేసినా అది జట్టు గెలిచినప్పుడు ముఖంలో చిరునవ్వు అనేది ఉంటుంది. గతంలో భారత్‌పై సెంచరీ చేసినప్పుడు మ్యాచ్‌ను ఓడిపోయాం. దాంతో అది నాకు ఎక్కువ సంతృప్తినివ్వ లేదు’ అని హెట్‌మెయిర్‌ అన్నాడు.

ఇక సెంచరీ సాధించిన మరో విండీస్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ కూడా విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు. ‘ నా ముఖంలో ఎక్కువ నవ్వు కనిపించలేదు. దానికి కారణం సుదీర్ఘ సమయం క్రీజ్‌లో పాతుకుపోవాలనే ప‍్రయత్నంలో భాగంగానే మ్యాచ్‌ అంతా సీరియస్‌గా ఉన్నా. మా ఇద్దరిలో ఎవరో ఒకరు కడవరకూ ఉంటే మ్యాచ్‌ను ఈజీగా గెలుస్తామని అనుకున్నాం. హెట్‌మెయిర్‌ ఇంతా ధాటిగా బ్యాటింగ్‌ చేస్తాడని అనుకోలేదు. పిచ్‌ బాగా స్లోగా టర్న్‌ అవుతున్న సమయంలో స్పిన్నర్లపై హెట్‌మెయిర్‌ ఎదురుదాడి చేయడంతో బ్యాటింగ్‌ ఈజీగా మారిపోయింది. క్రికెట్‌ అంటేనే భాగస్వామ్యాలు. మేము కీలక భాగస్వామ్యం సాధించడంతో విజయం సునాయాసమైంది’ అని హోప్‌ పేర్కొన్నాడు.

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని విండీస్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హెట్‌మెయిర్‌(139; 106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్‌ హోప్‌(102 నాటౌట్‌; 151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌)లు సెంచరీలు సాధించి వెస్టిండీస్‌ విజయంలో  కీలక పాత్ర పోషించారు.

ఇక్కడ చదవండి:

జడేజా రనౌట్‌పై వివాదం.. కోహ్లినే వచ్చేశాడు!

హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top