నా కెప్టెన్సీలో ట్రోఫీ అందించా.. జట్టులో ఉంటానో లేదో! | Sakshi
Sakshi News home page

నా కెప్టెన్సీలో ట్రోఫీ అందించా.. జట్టులో ఉంటానో లేదో!

Published Fri, Jan 26 2018 5:10 PM

I dont know to play for which team, says Harbhajan Singh - Sakshi

సాక్షి, ముంబై: 'పదేళ్లు ఆ జట్టుకు ఆడా. నా కెప్టెన్సీలో ట్రోఫీని అందించా. ఇప్పుడు ఆ జట్టులో ఉంటానో లేదో అర్థం కావడం లేదని' ముంబై ఇండియన్స్ ప్లేయర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు రోహిత్ శర్మ, లసిత్ మలింగ, హర్భజన్ సింగ్. కానీ పదేళ్ల అనంతరం ఆ ఫ్రాంచైజీకి అతడు మళ్లీ ఆడతాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో హర్భజన్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లాడిన పంజాబ్ మూడు విజయాలు సాధించి 12పాయింట్లతో ఉంది. త్వరలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపై టీమిండియా క్రికెటర్ హర్భజన్ స్పందించాడు.

'ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పదేళ్లు ఈ జట్టులో కొనసాగాను. ఐదు ట్రోఫీలు సాధించాం. అందులో ఒకటి నా కెప్టెన్సీలో వచ్చింది.  ప్రతిక్షణం ఆటను ఆస్వాదించా. పదేళ్ల ముంబై ఇండియన్స్ అనుబంధం తర్వాత నేను ఏ జట్టుకు ఆడతానో తెలియని పరిస్థి ఏర్పడింది. నన్ను ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందో త్వరలోనే తెలుస్తుందని' భజ్జీ వివరించాడు. పొట్టి ఫార్మాట్లోలోనూ బ్యాట్స్‌మెన్లు అందించిన విజయాలతో పోల్చితే బౌలర్ల వల్ల వచ్చినవే అధికమని ఈ ఆఫ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ వేలంలో భజ్జీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో ఏ జట్టు ఎక్కువ ధరకు అడిగితే ఆ ఫ్రాంచైజీకి భజ్జీ సొంతం అవుతాడు. మరికొందరు సీనియర్ క్రికెటర్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకూ 3 ఐపీఎల్, 2 ఛాంపియన్స్ ట్రోఫీలను తమ ఖాతాలో వేసుకుంది.

Advertisement
Advertisement