అంబటి రాయుడిపై చర్యలు!

HCA Set To Take Legal Action Against Ambati Rayudu - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అవినీతి రాజ్యమేలుతోందని క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. హెచ్‌సీఏలోని పెద్దల్ని అవమానపరుస్తూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్‌సీఏలో ముఖ్యడొకరు పేర్కొన్నారు.దాంతో రాయుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

‘ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి.. ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగించిన రాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే మేము నడుచుకుంటాం. మొదటగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఈవోను ఆదేశిస్తాం. నివేదిక సమర్పించిన తర్వాత అత్యున్నత మండలి అతనిపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని సదరు సభ్యుడు పేర్కొన్నారు

హెచ్‌సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)కు ట్వీట్‌ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌ క్రికెట్‌ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్‌ సర్‌... దయచేసి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి.

జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్‌ క్రికెట్‌ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్‌ క్రికెట్‌ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్‌లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంబటి రాయుడు తీవ్ర అసహనంలో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. అయితే దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని అజహర్‌కు అంబటి రాయుడు సూచించాడు. హెచ్‌సీఏ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top